
బాలింత ఆత్మహత్య
ములకలపల్లి: క్షణికావేశానికి గురై పురుగుల మందు తాగిన ఆరు నెలల బాలింత మృతి చెందింది. ఎస్సై ఎస్.మధుప్రసాద్ కథనం ప్రకారం.. మండల పరిఽధిలోని పాతగంగారం గ్రామానికి చెందిప శివాని (21)కి, రాచన్నగూడెం గ్రామానికి చెందిన మడివి జగపతితో వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. బుధవారం రాత్రి భర్త బతుకమ్మ ఆట నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన శివాని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కటి నుంచి వరంగల్‌కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. మృతురాలు తండ్రి దుబ్బా చిన్నబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
దమ్మపేట: భవనంపై నుంచి కిందపడి చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని గుడివాడకు చెందిన రాయనిపాటి కళ్యాణ శేఖర్(42)కు దమ్మపేట గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహం జరిగింది. దంపతులు ఏడేళ్లుగా తమ ఇద్దరు కుమారులతో కలిసి దమ్మపేటలోని గాయత్రి నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. జయలక్ష్మి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా, శేఖర్ ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో దసరా పండుగ రోజు గురువారం రాత్రి దమ్మపేటలోని గాయత్రి నగర్‌లో అద్దెకు ఉంటున్న భవనం తి మూడో అంతస్తు నుంచి కళ్యాణ్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రగాయాలు కాగా సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు..
ఇల్లెందురూరల్: మండలంలోని మొండితోగు గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండితోగు గ్రామానికి చెందిన జోగ వినోద్(25) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వినోద్ ఇల్లెందులో దసరా ఉత్సవాలను వీక్షించి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలానికి చెందిన ఏక విష్ణు మరో బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లెందు–గుండాల రహదారిపై మూలమలుపు వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నా యి. దీంతో ఇద్దరికి త్రీవ గాయాలు కాగా, స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వినోద్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఏక విష్ణు చికిత్స పొందుతున్నాడు. ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
మణుగూరు టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్‌నగర్‌లోని పేకాట స్థావరంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేసి తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు. ఆరు సెల్‌ఫోన్లు, మోటార్‌సైకిల్, రూ.8,030 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో ఐతనబోయిన గోపి, కుంట నాగరాజు, కుంట నవీన్, మామిళ్ల రవి, అక్కినపల్లి చంటి, దేపాక నరేశ్, ఉప్పు శ్రీను, బాడిష శ్రీను, రేపాకుల వెంకన్న ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు మణుగూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు తెలిపారు.