
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా వీరన్న
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ జాగృతి జిల్లా నూతన అధ్యక్షుడిగా డి.వీరన్నను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరన్న మాట్లాడారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో వెనుకబడే ఉందన్నారు. ఆంధ్రాలో విలీనం చేసిన గ్రామాలను పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేవరకు పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాద్రి రామయ్య భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. త్వరలో పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి ఆటో విభాగం జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాళోత్ రాజేందర్ నాయక్, విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు సురేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సునీత, ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆదినారాయణ, సుగుణ, విజయ, ప్రవీణ్, సత్యవతి, ఆటో యూనియన్ నాయకులు ముజాహిద్, దేశి ప్రసాద్, రాంబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.