
నేత్రపర్వంగా విజయోత్సవం
దసరా మండపంలో శమీ, ఆయుధ పూజలు
ముగిసిన శ్రీరామాయణ పారాయోణోత్సవాలు
7న దమ్మక్క సేవా యాత్ర
ఇల్లెందు : పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో గురువారం రాత్రి నిర్వహించిన రావణవధ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఇల్లెందులపాడు నుంచి వచ్చిన గుర్రాల రథం, దానిపై అమ్మవారు తరలివస్తున్న దృశ్యం హైలెట్‌గా మారింది. అయితే ఉత్సవాలు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో భారీ సంఖ్యలో హాజరైనా.. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు కొంతమేర ఇబ్బంది పడ్డారు. వేదిక ఎత్తు తక్కువగా ఉండడంతో వెనుక ఉన్నవారికి వేడుకల దృశ్యాలు కనిపించకపోవడంతో పలువురు అసంతృప్తికి లోనయ్యారు. కనీసం ఎల్‌ఈడీ స్క్రీన్లయినా ఏర్పాటు చేస్తారనేకుంటే ఆశాభంగమే అయిందని నిట్టూర్చారు.
పత్తాలేని పాలపిట్ట..
సింగరేణి ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో దసరా సందర్భంగా నిర్వహించిన జమ్మి(శమీ)పూజ వెలవెలబోయింది. విజయదశమి రోజున పాలపిట్టను చూడడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే గతంలో పాలపిట్ట బొమ్మను గ్రౌండ్‌లో ఏర్పాటుచేసేవారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్షంగా పాలపిట్ట దర్శనం కల్పిస్తామని నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసినా.. చివరకు పాలపిట్ట కనిపించనే లేదు. దీంతో అందరూ నిరాశకు లోనయ్యారు. సినీ, టీవీ కళాకారుల మ్యూజికల్ నైట్, ఆట – పాటలు కూడా అలరించలేదు. తాగునీటి సౌకర్యం లేక పలువురు అల్లాడారు.
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా రామదాసు నిర్మించిన దసరా మండపంలో అర్చకుల ప్రత్యేక పూజలు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ వైభవంగా విజయోత్సవం నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామికి రామదాసు చేయించిన ఆభరణాలు అలంకరించి మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పల్లకీ సేవగా దసరా మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత జమ్మిచెట్టు వద్ద అర్చకులు పుణ్యావాచనం, శమీ పూజ చేశారు. స్వామి వారి ఆయుధాలకు ప్రత్యేక పూజలు గావించారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని, రావణాసురుడి చెర నుంచి ప్రజలను కాపాడిన రాముడి విజయమని అర్చకులు పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ఈఓ దామోదర్ రావు చేతుల మీదుగా రావణాసుర వధ గావించే శ్రీరామ లీలా మహోత్సవ కార్యక్రమం జరిపారు. రావణాసురిడి ప్రతిమపై బాణం సంధించగా మిరుమిట్లు గొలిపే బాణసంచా కాంతులతో దసరా మండప ప్రాంగణం మెరిసిపోయింది. ఈ సమయంలో భక్తులు చేసిన శ్రీరామనామస్మరణలు, జయజయ ధ్వానాలతో దసరా మండప ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది. పూజల అనంతరం భక్తులు జమ్మి చెట్టు ఆకులను తలపై పెట్టుకుని, ఆ తర్వాత భద్రంగా దాచుకున్నారు.
రామాలయంలో భక్తుల రద్దీ..
దసరా సెలవులు ముగింపు దశకు రావడం, వారాంతపు సెలవులు కావడంతో రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురు, శుక్రవారాల్లో జరిగిన నిత్యకల్యాణాలకు భారీగా హాజరయ్యారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, ఈనెల 7న శబరి స్మృతి యాత్ర నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్‌రావు తెలిపారు. ఉదయం 6.30 గంటలకు గిరి ప్రదక్షిణ, దమ్మక్క విగ్రహం వద్ద నివాళుల అనంతరం బేడా మండపంలో నిత్యకల్యాణం ఉంటుందని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాల మేరకు వేడుక నిర్వహిస్తామని, బస్సుల ద్వారా వివిధ గ్రామాల నుంచి గిరిజనులను భద్రాచలం తరలించి ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
ముగిసిన శ్రీరామాయణ పారాయణోత్సవాలు
విజయదశమిని పురస్కరించుకుని రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్న శ్రీరామాయణ పారాయణోత్సవాలు గురువారంతో ముగిశాయి. శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపులో భాగంగా సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంక్షేప రామాయణ హవనం, మహా పూర్ణాహుతితో ముగింపు పలికారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వేడుకలు

నేత్రపర్వంగా విజయోత్సవం

నేత్రపర్వంగా విజయోత్సవం