
శాంతించిన గోదావరి
● కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక ● పంటలు దెబ్బతినడంతో రైతుల్లో ఆందోళన
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ దోబూచులాడుతున్న గోదావరి ప్రస్తుతం నెమ్మదిగా తగ్గుతూ బుధవారం రాత్రి 8 గంటలకు 44.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం 5గంటల వరకు పెరుగుతూ 50 అడుగులకు చేరిన నీటిమట్టం.. స్వల్పంగా తగ్గుతూ బుధవారం ఉదమం 7.27 నిమిషాలకు 47.9 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. గోదావరి నీటి మట్టం 43 అడుగుల దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా విరమించనున్నారు. గత రెండు రోజులుగా భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురంతో పాటు ఏపీలోని విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రాహదారులపై వరద నీరు నిల్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే ఈ ప్రాంతాలకు రాకపోకలు పునః ప్రారంభం కానున్నాయి.
పంటలకు నష్టమే..
రెండు నెలలుగా గోదావరి వరద ముంపునకు గురవుతున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే వరుస అల్పపీడనాలతో కురుస్తున్న వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది. ఇప్పుడు గోదావరి వరదలతో పరిస్థితి మరింతగా క్షీణించింది. పత్తితో పాటు వరి పంటపై కూడా రైతులు ఆశలు వదులుకున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.