
● సందడే సందడి..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఒక రోజు ముందే దసరా సందడి నెలకొంది. పండుగకు స్వగ్రామాలకు వచ్చే వారితో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. కార్లు, ద్విచక్ర వాహనాలకు ఆఫర్లు ప్రకటించగా వాటి కొనుగోలుకు పలువురు ఆసక్తి కనబరస్తున్నారు. ఇక వస్త్ర దుకాణాల వారు సైతం వినియోగదారులను ఆకట్టుకునేలా రూ.3 వేలు, ఆపైన కొనుగోలు చేస్తే సిల్వర్ కాయిన్, మరికొన్ని దుకాణాల వారు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు బహుమతులు ప్రకటించగా అమ్మకాలు జోరందుకున్నాయి. ఆఫర్లతో టీవీ, మొబైల్ ఫోన్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు కొనుగోళ్లకు పలువురు ముందుకొస్తున్నారు. గాంధీజయంతి, దసరా ఒకేరోజు రావడంతో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. గురువారం రోజున మాంసం అమ్మినా, రెస్టారెంట్లలోనూ మాంసాహారం వడ్డించినా చర్యలు తప్పవని కార్పొరేషన్ కమిషనర్ సుజాత హెచ్చరించారు. దీంతో ఎక్కువ మంది బుధవారమే మద్యం, మాంసం కొనుగోలు చేయగా ఆయా దుకాణాల వద్ద రద్దీ కనిపించింది.