
● దసరా.. సరదా తీరేదెలా ?
కొత్తగూడెంటౌన్: దసరా అంటేనే సరదాలకు ప్రతీక. మిగితా పండుగలతో పోలిస్తే దసరాకే ఎక్కువ మంది మాంసాహారం, మద్యం వినియోగిస్తుంటారు. పండుగ రోజున తమ షాపులు, పరిశ్రమలు, వాహనాల ఎదుట కోళ్లు, జీవాలను బలి ఇస్తుంటారు. కానీ ఈ ఏడాది గాంధీ జయంతి రోజున దసరా రావడంతో పలువురు ఆలోచనలో పడ్డారు. మరోవైపున గురువారం మద్యం, మాంసం దుకాణాలు తెరిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. దీంతో కొనుగోలు దారులు సైతం సందిగ్ధంలో పడ్డారు. కొందరు బుధవారమే మాంసాహార భోజనం చేసినా.. పండుగ రోజు పప్పన్నంతో తినడం ఎలా అని సంకోచిస్తున్నారు. గాంధీ జయంతి రోజే దసరా రావడంతో షాపులు తెరవకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు.