
నిండు కుండలా కిన్నెరసాని
ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయం నీటిమట్టం పూర్తిస్థియిలో నిండి నిండుకుండను తలపిస్తోంది. ఈ ఏడాదిలో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండటం ఇదే ప్రథమం. ఎగువన కురిసిన వర్షానికి 1,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం బుధవారం రాత్రికి 407 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లను ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్‌సైడ్ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి
మణుగూరుటౌన్: సింగరేణిలోని ఓబీ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న కంచర్ల ప్రవీణ్ గత నెల 26వ తేదీన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. తలకు బలమైన గాయం కావడంతో ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉయిక రమేశ్ (30) మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గొల్లపల్లి సమీపంలోని సింగారం గ్రామానికి చెందిన రమేశ్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. గౌరారం శివారులో బైక్ అదుపుతప్పి కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తికి గాయాలు
మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు బొగ్గు తరలించే టిప్పర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విప్పలసింగారానికి చెందిన గోవర్దన్ ఇంటి నుంచి సెంటర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఓసీ–4 వైపు నుంచి టిప్పర్ లోడ్‌తో బీటీపీఎస్‌కు వెళ్తోంది. జీఎం కార్యాలయం దాటిన తర్వాత మూలమలుపు వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొట్టింది. గోవర్దన్ గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులు టిప్పర్ల వేగాన్ని నియంత్రించాలని ఆందోళన చేపట్టారు. సింగరేణి సెక్యూరిటీ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.