
స్వరాష్ట్రంలో తొలి పోరు
విలీన, మున్సిపల్ సమస్యలతో 2018లో ఎన్నికలు జరగని వైనం
జెడ్పీటీసీ బీసీ మహిళ.. సర్పంచ్
ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్
మేజర్ గ్రామపంచాయతీకీ..
భద్రాచలం: స్థానిక సంస్థల ఎన్నికలకు భద్రగిరి సిద్ధమవుతోంది. రాష్ట్రమంతటా గతంలో స్థానిక ఎన్నికలు జరిగినా భద్రాచలంలో ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భద్రాచలంలో మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలు ఇవే తొలిసారి కానున్నాయి. భద్రాచలం మండల పరిషత్ జనవరి 1, 1987న ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2014లో రాష్ట్ర విభజనకు ముందు మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గ కాలం 2018లో ముగిసింది. నాడు 13 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగగా, చివరి జెడ్పీటీసీగా జి.రవికుమార్ బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం జరిగిన రాష్ట్ర విభజనలో భద్రాచలం మండలం మినహా ఇతర(పోలవరం ముంపు) గ్రామాలన్నీ ఏపీలో విలీనం చేశారు. పాలకవర్గం కాలం ముగిసిన అనంతరం మళ్లీ ఎన్నికలను జరపలేదు. ఆ తర్వాత నిర్వీర్యంగా మారిన మండల పరిషత్‌ను నూతనంగా ఏర్పాటు చేసిన ఆళ్లపల్లి మండలానికి తరలించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలల క్రితం తిరిగి భద్రాచలానికి మండల పరిషత్ కేటాయించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. 2014లో 13 ఎంపీటీసీలు ఉండగా, ఇప్పుడు 14కు పెంచారు. జెడ్పీటీసీ బీసీ మహిళకు, ఎంపీపీని గిరిజన మహిళకు కేటాయించారు. 20 వార్డుల్లో 60 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈసారి భద్రాచలంలోనూ పరిషత్, పంచాయతీ ఎన్నికలు
మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న భద్రాచలం మున్సిపాలిటీగా, గ్రామపంచాయతీగా, మళ్లీ మూడు గ్రామపంచాయతీలుగా, అనంతరం ఒక్క గ్రామపంచాయతీ ఏర్పాటు చేసే చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు మేజర్ పంచాయతీగానే ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ చివరిసారిగా 2013లో ఎన్నికలు జరగ్గా, పాలకవర్గ కాలం 2018లో ముగిసింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాచలం, సారపాకలను మున్సిపాలిటీగా ప్రకటించగా, ఆదివాసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో చుక్కెదురుకాగా భద్రాచలాన్ని మూడు గ్రామపంచాయతీలుగా విభజించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రాచలం చివరి సర్పంచ్‌గా భూక్యా శ్వేత వ్యవహరించారు. ప్రస్తుతం తిరిగి మళ్లీ ఎస్టీ జనరల్‌కే సర్పంచ్‌ను కేటాయించారు. 20 వార్డుల్లో 10 వార్డులను ఎస్టీ జనరల్ మహిళలకు కేటాయించగా, మరో 5 వార్డులను జనరల్ విభాగంలోని మహిళలకు, మరో ఐదింటిని జనరల్‌కు రిజర్వేషన్ చేశారు. ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా, ఆశావాహులు సమీకరణాల్లో మునిగిపోయారు. రాజకీయ పార్టీల పెద్దలతో టచ్‌లోకి వెళ్లారు. అధికార కాంగ్రెస్‌లో సర్పంచ్, జెడ్పీటీసీ పదవులకు విపరీతమైన పోటీనెలకొంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎమ్మెల్యే, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు.

స్వరాష్ట్రంలో తొలి పోరు