
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
రేగా కాంతారావు
మణుగూరు రూరల్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పని చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీల ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విడుదల చేసిన బాకీ కార్డును కూడా ఇంటింటికి పంచాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, నాయకులు లక్ష్మణ్, అప్పారావు, యూసుఫ్, నర్సింహరావు, ప్రభుదాసు, పాల్గొన్నారు.
అవినీతిపై
విచారణ జరపాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో డీడీగా పనిచేసి మణెమ్మ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని గిరిజన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పృథ్వీనాయక్ సోమవారం ఐటీడీఏ పీఓ రాహుల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లేని మెనూ అమలు చేసి గిరిజన విద్యార్థులు అనారోగ్యం పాలవ్వడానికి కారణమయ్యారని తెలిపారు. వసతి గృహాల మరమ్మతులు, సరుకుల టెండర్లు, డిప్యూటేషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
డివైడర్‌ను ఢీకొట్టి
కంటైనర్ బోల్తా
ఏన్కూరు: కొత్తగూడెం నుండి ఖమ్మం వైపు వెళ్తున్న కంటైనర్ ఏన్కూరులోని డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. సోమవారం తెల్ల వారుజామున ఈ ఘటన జరగగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు.
ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఖమ్మం కవిరాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన సీహెచ్.సురేష్‌బాబు, వడిగాశిల్ప శశికళారాణికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి బి.రజని సోమవారం తీర్పుచెప్పారు. ఖమ్మం నెహ్రూనగర్‌కు చెందిన జె.రామ జగ్గారావు వద్ద సురేష్, శశికళారాణి 2020 ఫిబ్రవరిలో రూ.6 లక్షల అప్పు తీసుకున్నారు. తిరిగి 2021 ఫిబ్రవరిలో రూ.6 లక్షలకు చెక్కు ఇచ్చినా వారి ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో జగ్గారావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈమేరకు ఇద్దరికి జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.6లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
వ్యక్తి ఆత్మహత్య
పాల్వంచరూరల్: మద్యం తాగొద్దని తల్లి మందలించినందుకు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని మారుతినగర్‌కు చెందిన పంతంగి ఉపేందర్(46) సీతారాంపట్నం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 27న మద్యం తాగి ఇంటికి రాగా తల్లి ఈశ్వరమ్మ మందలించింది. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పురుగుల మందుతాగాడు. అపస్మారక స్థితిలో పడిపోగా స్నేహితులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి మెరుగైన వైద్యంకోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పట్టణ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి