
నకిలీ నోట్ల కలకలం
ముగ్గురు పూల వ్యాపారులకు టోకరా
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం సూపర్‌బజార్ ఏరియాలో సోమవారం ముగ్గురు పూల వ్యాపారులకు నకిలీ రూ.500 నోట్లను అంటగట్టి దుండగులు ఉడాయించారు. అడవి కంబాలపల్లి(ఇల్లెందు)కి చెందిన వీరభద్రం, సుజాతనగర్ మండలం రాఘవపురానికి చెందిన సిద్దెల వంశీ, మరో మహిళ బతుకమ్మ పూలు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కో వ్యాపారి వద్ద రూ.100 గునుగు పూలను కొన్నారు. రూ.500 నకిలీ నోటు ఇచ్చి, వ్యాపారి నుంచి రూ.400 తీసుకుని వెళ్లిపోయారు. వ్యాపారులు ఆ నోట్లను గుర్తించేలోపే దుండగులు అక్కడి నుంచి జారుకున్నారు. నోట్లపై ఒకవైపు ముద్రణ ఉండగా మరో వైపు తెల్లగా ఉంది. దొంగనోటు ఇచ్చిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరా కూడా లేక పోవడంతో చిరువ్యాపారులు లబోదిబోమంటున్నారు. దొంగనోట్లను అంటగట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.
వ్యక్తి ఆత్మహత్యపై కేసు
పాల్వంచరూరల్: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కేసీఆర్ నగర్‌కు చెందిన బానోతు రాజేంద్రప్రసాద్(37) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం డ్రెయినేజీ దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో రెండుకాళ్లు విరిగి గాయపడ్డాడు. పనులకు వెళ్లలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెంది ఈ నెల 7న పురుగుల మందుతాగాడు. వరంగల్ ఎంజీఎం తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పట్టణ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
‘చాంబర్’ ఎన్నికలకు సమాయత్తం
మూడేళ్లకోసారి ఆఫీస్ బేరర్లు, 19శాఖల ప్రతినిధుల ఎన్నిక
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆఫీస్ బేరర్లు, 19 వ్యాపార శాఖల విభాగాల ప్రతినిధులను మూడేళ్లకోసారి ఎన్నుకుంటారు. ఈమేరకు వ్యాపారులు ప్యానెళ్లుగా ఏర్పడి బరిలో నిలుస్తారు. ఈసారి అధ్యక్షుడిగా కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కురువెళ్ల కాంతారావు, సహాయ కార్యదర్శిగా బాదె రమేష్, కోశాధికారిగా తూములూరి లక్ష్మీనరసింహారావు పోటీ చేసేలా మరికొందరితో ప్యానల్ ఏర్పాటైంది. ఈ ప్యానల్ బాధ్యులు సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. వీరికి మద్దతుగా పత్తిపాక రమేష్, పొలవరపు కోటేశ్వరరావు, మాటేటి రాకేష్, చిలకల ఆదినారాయణ, వడ్డే వెంకటేశ్వర్లు, సోమవరపు సుదీర్‌కుమార్, ప్రభాకర్, బజ్జూరి రమణా రెడ్డి, బండి సతీష్ సిరికొండ వెంకటేశ్వర్లు, గుడిపూడి నరిసింహారావు ప్రచారంలో పాల్గొన్నారు.

నకిలీ నోట్ల కలకలం