
గోదావరి దోబూచులాట
భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. 24 గంటల వ్యవధిలో భద్రాచలం వద్ద రెండుసార్లు నీటిమట్టం 43 అడుగులు దాటడంతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ఉదయం 40.80 అడుగులు ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 12 గంటలకు 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. 46.60 అడుగులకు చేరి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి శనివారం రాత్రి 10 గంటలకు 42.90 అడుగులు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. శనివారం ఉదయం వరకు తగ్గిన గోదావరి మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9 గంటలకు ప్రవాహం 43.80 అడుగులకు చేరింది. రాత్రి 10 గంటలకు స్వల్పంగా తగ్గి 43.70 అడుగులుగా నీటిమట్టం నమోదైంది. గోదావరి తీర ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు నదిలో దిగకుండా హెచ్చరిక బోర్డులు, కంచె ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మరో మూడు అడుగులు పెరిగితే భద్రాచలం నుంచి చర్లతోపాటు ముంపు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి.
24 గంటల వ్యవధిలో రెండు సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ