
కదంతొక్కిన ఆదివాసీలు
● ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి ● ధర్మయుద్ధ సభలో ఆదివాసీ సంఘాల నాయకులు ● భద్రాచలంలో ఆదివాసీ సంప్రదాయ సందడి
భద్రాచలం: ఆదివాసీలు కదం తొక్కారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడాలు, బంజారాలను తొలగించే వరకు ధర్మయుద్ధం ఆగదని నినదించారు. ఫలితం వచ్చేవరకూ న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీ జాబితాలో ఉన్న బంజారాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి ఆదివాసీలు ఆదివారం భద్రాచలం తరలివచ్చారు. సంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించారు. సారపాక బ్రిడ్జి, కూనవరం, చర్ల రోడ్ల నుంచి ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్‌లో, పాత మార్కెట్ సెంటర్‌లో ఆదివాసీ వీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభకు తరలివెళ్లారు.
అన్నింటా అన్యాయమే..
లంబాడాలను ఎస్టీ జాబితాలో కలపటం వల్ల ఆదివాసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతోందని ఆదివాసీ రాజకీయ, కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్మయుద్ధం పేరిట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1971లో ఆదివాసీలు 2,85,226 మంది, లంబాడాలు 1,32,464 మంది ఉండగా, 1981లో ఆదివాసీల సంఖ్య, 3,59,799కు, లంబాడాల సంఖ్యకు 11,58,342కు చేరిందని అన్నారు. 2021 లెక్కల ప్రకారం ఆదివాసీలు 9 లక్షలకు పైగా ఉండగా, లంబాడాల సంఖ్య 40 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఓసీ, బీసీ లంబాడాలందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి చొరబడ్డారని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు న్యాయ పోరాటం ఆగదని అన్నారు. ఎస్టీ జాబితా నుంచి బంజారాలను, లంబాడాలను తొలగించాలని హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులో విచారణలో ఉన్నాయని తెలిపారు. న్యాయపోరాటం చేస్తున్న ఆదివాసీలపై లంబాడాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆరోపించారు. తమ పోరాటానికి అందరూ సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, పినపాక, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు, ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు కొర్స వెంకటేశ్వరరావు, పొడియం బాలరాజు, కల్లూరి జయబాబు, మైపతి అరుణ్‌కుమార్, రాంబాబు, పూనెం శ్రీనివాస్, తెల్లం వెంకటేశ్వరరావు, తెల్లం రమణయ్య, ముర్రం వీరభద్రం, ముర్ల రమేష్, కోవా దవలత్ రావు, తెల్లం సీతమ్మ, పూసం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కదంతొక్కిన ఆదివాసీలు