పండుగ వేళ ప్రయాణ పాట్లు | - | Sakshi
Sakshi News home page

పండుగ వేళ ప్రయాణ పాట్లు

Sep 29 2025 7:30 AM | Updated on Sep 29 2025 7:30 AM

పండుగ వేళ ప్రయాణ పాట్లు

పండుగ వేళ ప్రయాణ పాట్లు

కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు రెండే రైళ్లు దసరా రాకపోకలతో కిటకిటలాడుతున్న వైనం బోగీలను పెంచాలని కోరుతున్న ప్రయాణికులు

కొత్తగూడెంఅర్బన్‌: దసరా పండుగ సమీపిస్తుండటంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. కానీ రైల్వేశాఖ ప్రయాణికుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయలేదు. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌(కొత్తగూడెం) నుంచి అత్యధికంగా ఆదాయం గడిస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌ వరకు తెల్లవారుజామున నడిచే కాకతీయ రైలు, రాత్రి నడిచే మణుగూరు ఎక్స్‌ప్రెస్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు నడిచే సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో పండుగ వేళ ప్రయాణికుల రద్దీ నెలకొంటోంది. వీటితోపాటు మధ్యాహ్నం కొత్తగూడెం నుంచి విజయవాడకు మరో రైలు నడిపిస్తున్నారు. రైళ్లలో రిజర్వేషన్లు సైతం పండుగ తర్వాత వరకు కూడా బిజీ షెడ్యూల్‌తో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పండుగలకు సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కరోనా కంటే ముందు రద్దు చేసిన రైళ్లను కూడా పునరుద్ధరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. సింగరేణి రైలుకు బదులుగా నడుపుతున్న పుష్‌పుల్‌ రైలులో సామగ్రి పెట్టుకునే వీలులేదు. బాత్‌రూంల నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో దసరా తర్వాత కనీసం వారంరోజుల వరకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని, రైళ్లలో స్వచ్ఛత పాటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రద్దయిన రైళ్ల కోసం ఎదురుచూపులు

కొత్తగూడెం నుంచి కరోనా సమయంలో రద్దు చేసిన రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. పండుగ సమయంలోనైనా పునఃప్రారంభించాలని, కాకతీయ రైలుకు పాత పద్ధతిలో అదనపు బోగీలు, స్లీపర్‌ కోచ్‌తో పాటు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని, బెల్గావి రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీటిపై గత జూలైలో హైదరాబాద్‌లో జరిగిన డీఆర్‌యూసీసీ సమావేశంలో రైల్వే అధికారులు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు.

నత్తనడకన అమృత్‌ పథకం పనులు

రైల్వే స్టేషన్‌లో అమృత్‌ పథకంలో భాగంగా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్టేషన్‌లో వెయిటింగ్‌ హాల్‌ ఒక్కటీ పూర్తికాలేదు. దీంతో ప్రయాణికులు స్టేషన్‌లో ఇబ్బందులు పడుతున్నారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి బొగ్గు రవాణా ద్వారానే ఏటా రూ.650 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. అయినా రైల్వే అధికారులు ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలేదు.

గతంలో ఏడు రైళ్లు

గతంలో కొత్తగూడెం స్టేషన్‌ నుంచి ఏడు రైళ్లు రాకపోకలు సాగించేవి. సింగరేణి ఎక్స్‌ప్రెస్‌, డోర్నకల్‌ ప్యాసింజర్‌, విజయవాడ ప్యాసింజర్‌, కాజీపేట ప్యాసింజర్‌, కాకతీయ ప్యాసింజర్‌, కొల్హాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, మణుగూరు సూపర్‌ఫాస్ట్‌ సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం మణుగూరు సూపర్‌ఫాస్ట్‌, సింగరేణి ఎక్స్‌ప్రెస్‌, కాకతీయ ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ రైలు మాత్రమే నడుస్తున్నాయి. బెల్గావి రైలును గతేడాది రద్దు చేశారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైళ్ల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement