
విజేతలుగా నిలవాలని..
● భక్తులకు విజయలక్ష్మి అమ్మవారి దీవెనలు ● నేడు ఐశ్యర్య లక్ష్మిగా అమ్మవారు
భద్రాచలం: జ్ఞానం ద్వారా విజేతలుగా నిలవాలని, విజయోస్తు అంటూ విజయలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులను దీవెనలు అందించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం లక్ష్మీతాయారు అమ్మవారు విజయలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం సామూహిక కుంకుమ పూజలు జరిపారు. చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు సుందరకాండ పారాయణం చేశారు.
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం తెల్లవారుజామున అభిషేకం జరిపారు. గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, సువర్ణ పుష్పార్చన చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. దసరా సెలవులు, ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: రామాలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆదివారం విజయవాడలోని సుందరయ్య నగర్ కాలనీకి చెందిన వీర్నాల శ్రీమన్నారాయణ రూ.74,400 వేల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
నేటి ఐశ్వర్యలక్ష్మి అలంకార విశిష్టత
‘అస్యేశానా జగతో విష్ణుపత్నీ’ అని కీర్తిస్తుంది.. యజుర్వేదం. ఐశ్వర్యం అంటే శాఖాపరమైన శక్తి సామర్థ్యాలని, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు శాసకరాలు, కరుణారూపిణి అయిన ఈ అమ్మ క్రీగంటి చూపుల కదలికలనే శాసనాలుగా భావించి శ్రీ మహావిష్ణువు సకల జగద్రక్షణ చేస్తుంటాడని శ్రీ పరాశరభట్టార్ కీర్తించారు. ఈ రూపంలో ఉన్న అమ్మను ఆరాధిస్తే శాసకత్వం, వాక్కుకు ప్రభావం, అనంత ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.