
పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు
● జిల్లాలో 471 జీపీలు, 4,168 వార్డులు ● అధికంగా ఎస్టీలకు 460 సర్పంచ్ స్థానాలు
చుంచుపల్లి: జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ, 22 ఎంపీపీ స్థానాలకు అధికారులు శనివారం రిజర్వేషన్లు ప్రకటించారు. ఇదే క్రమంలో ఆదివారం జిల్లాలోని 471 పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులకు, 4,168 వార్డులకు సైతం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి వెల్లడించారు. 471 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు గాను 235 చోట్ల ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేయగా, మరో 225 స్థానాలను ఎస్టీ మహిళలకు కేటాయించారు. ఇక ఎస్సీలకు జనరల్‌లో రెండు స్థానాలు కేటాయించగా, బీసీ జనరల్‌కు నాలుగు స్థానాలు, బీసీ మహిళకు మరో రెండు స్థానాలను, జనరల్ అభ్యర్థులకు మూడు స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇక గ్రామ పంచాయతీల పరిధిలోని 4,168 వార్డులకు గాను ఎస్టీ జనరల్‌కు 1,396 కేటాయించగా, ఎస్టీ మహిళలకు 1,257 వార్డులను రిజర్వేషన్‌లో అవకాశం కల్పించారు. ఎస్సీ జనరల్‌కు 11, ఎస్సీ మహిళకు 7, బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 23 చొప్పున రిజర్వేషన్‌లో వెసులుబాటు కల్పించారు. జనరల్ స్థానాల్లో 789 వార్డులు కేటాయించగా, అదే జనరల్‌లో మరో 666 వార్డులను మహిళలకు అవకాశం కల్పించారు. గడిచిన నాలుగు రోజులుగా గ్రామ పంచాయతీల వారీగా పంచాయతీ అధికారులు తీవ్రస్థాయిలో ఈ రిజర్వేషన్ల కేటాయింపుపై తీవ్ర కసరత్తు చేశారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాబితాలను రూపొందించి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అనుమతితో రిజర్వేషన్లను ప్రకటించారు.