
గోదాముల్లోనే బతుకమ్మ చీరలు
నిరాశలో మహిళా సంఘాల సభ్యులు
చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల్లోని సభ్యులకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో సభ్యురాలికి రెండు చీరలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి చీరలు జిల్లాకు చేరుకున్నాయి. ఈ నెల 22 నుంచి చీరల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో చీరల పంపిణీకి బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది. ఈనెల 29న సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకోనున్నారు. సరిపడా చీరలను సరఫరా చేయకపోవడం వల్లే పంపిణీ నిలిపివేసినట్లు సమాచారం. దీంతో మహిళా సంఘాల సభ్యులు నిరాశ చెందుతున్నారు. కాగా జిల్లాకు చేరిన చీరలను కొత్తగూడెం, చుంచుపల్లి, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, అశ్వరావుపేట ప్రాంతాల్లోని గోదాంల్లో నిల్వ ఉంచారు. జిల్లాకు 2,13,367 చీరలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,06,685 చీరలు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు.