
ఐటీడీఏకు టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు
● పీఓకు అందజేసిన సీఎం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏకు టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు హైదరాబాద్ శిల్పారామంలో శనివారం జరిగిన ప్రపంచ పర్యాటక వేడుకల్లో పీఓ బి.రాహుల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అవార్డు అందజేశారు. ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతో పాటు ప్రాచర్యంలో తీసుకొచ్చినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపికై నట్లు పీఓ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అభినందించారని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కేటీపీఎస్ విస్తరణకు
కేంద్రం నుంచి సహకారం
● ఎంపీ రఘురాంరెడ్డి లేఖకు
కేంద్ర మంత్రి స్పందన
ఖమ్మంమయూరిసెంటర్: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్( కేటీపీఎస్) మరో రెండు యూనిట్ల విస్తరణ, ఆధునికీకరణకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్‌నాయక్ తెలిపారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆగస్టు 20న ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈమేరకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌నాయక్ సానుకూలత వ్యక్తం చేస్తూ తాజాగా ఎంపీ రఘురాంరెడ్డికి లేఖ పంపారు. పాత కేటీపీఎస్ స్టేషన్ వద్ద అందుబాటులో ఉన్న స్థలంలో రెండు 800 మెగావాట్ల యూనిట్ల స్థాపనకు నివేదిక సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీజీ జెన్కోకు సూచించగా.. నివేదిక రావాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. టీజీ జెన్కో నిధులు సమకూరుస్తుందని, ఆపై కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను సులభతరం చేయనుండగా, బొగ్గు కేటాయింపునకు సైతం కేంద్రం అవసరమైన మద్దతు ఇస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆ లేఖలో తెలిపారని ఎంపీ రఘురాంరెడ్డి వెల్లడించారు.
వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి వ్యాప్తంగా రోజుకు 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. సంస్థ ఈ ఏడాది 76 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా రోజుకు 1.80లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉంటుంది. కానీ వర్షం కారణంగా 90 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. కాగా సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్‌కాస్ట్ గనుల్లో రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాల్సి ఉండగా వర్షంతో విఘాతం కలిగింది. ఓసీల్లోకి చేరిన వాన నీటిని ప్లాంటూన్ పంపుల ద్వారా తీయిస్తున్నారు.
కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు వేడుకలను కలెక్టరేట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. డీఆర్డీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపాలిటీలు, టీజీఓఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ జితేష్ విపాటిల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీసీఓ రుక్మిణి, టీజీఓఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటపుల్లయ్య, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనారాణి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ‘ఓపెన్’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: ఈనెల 22న ప్రారంభమైన ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు శనివారం ముగిశాయని డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. చివరి రోజు ఇంటర్ అభ్యర్థులు 107 మందికి 87 మంది హాజరయ్యారని, ఉదయం జరిగిన పదో తరగతి పరీక్షకు ఎనిమిది మందికి ఆరుగురు, మధ్యాహ్నం పరీక్షకు 18 మందికి 12 మంది హాజరయ్యారని వివరించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు.

ఐటీడీఏకు టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు