
గోదావరి తగ్గుముఖం
నీట మునిగిన విస్తా కాంప్లెక్,
ఆలయ పడమర మెట్లు
మోటర్లతో తోడించిన అధికారులు
భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండగా భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం శనివారం ఉదయం వరకు పెరిగినా సాయంత్రం తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు 46 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమంగా తగ్గుతూ రాత్రి 10.30 గంటలకు 42.8 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహ రించారు. గోదావరి ప్రవా హం పెరగడంతో భద్రాచలం – చర్ల ప్రధాన రహదారితో పాటు ఏపీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడడం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు చేరడంతో రామాలయ పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం మునిగిపోయాయి. నీటిని గోదావరిలోకి ఎత్తిపోసేందుకు విస్తా కాంప్లెక్స్ వద్ద మోటార్లు ఏర్పాటు చేసినా, సకాలంలో ఆన్ చేయకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. కాగా, ఆలయ ఈఓ దామోదర్‌రావు శనివారం వర్షపు నీటిని తొలగించేలా చర్యలు చేపట్టారు. నీరు నిలిచిన ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లించడంతో పాటు పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు.
అప్రమత్తంగా ఉండాలని తుమ్మల ఆదేశం..
గోదావరి వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో శనివారం ఫోన్‌లో మాట్లాడి తగు సూచనలు చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, రైతులు, పశువుల కాపరులు వాగులు దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరకట్ట వద్ద స్లూయీస్ లీక్ కాకుండా చూడాలని, అత్యవసర వైద్య సేవల విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.