
ధాన్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు శనివారం ధాన్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం లక్ష్మీతాయారు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు విజయలక్ష్మి అలంకరణ..
లక్ష్మీతాయారమ్మవారు ఆదివారం విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయం అంటే కేవలం యుద్ధ విజయమే కాదని, అన్ని రంగాల్లో విజయమని, ఈ రూపంలో ఉన్న అమ్మను సేవిస్తే అన్ని రంగాల్లో సునిశితమైన జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా విజేయులను చేస్తుందని, అందుకే అమ్మవారిని విజయలక్ష్మిగా అలంకరిస్తున్నామని అర్చకులు తెలిపారు.
రామయ్యకు
సువర్ణ తులసీ అర్చన..
భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.