
కొండా లక్ష్మణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతి ఒక్కరూ అదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ.. తెలంగాణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో బాపూజీ కీలకపాత్ర పోషించారని అన్నారు. 1969లో జరిగిన తెలంగాణ తొలిదశ పోరాటంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికి అండగా దీక్ష చేశారని, మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేశారని కొనియాడారు. తనకంటూ ఏమీ లేకుండా బలహీన వర్గాల అభివృద్ధికి తన ఆస్తులను దానం చేసిన త్యాగశీలి అని అన్నారు. తుది శ్వాస వరకు తెలంగాణ సాధనకు, బడుగుజీవుల అభ్యున్నతికి కృషి చేశారని కీర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి అనేక కార్యక్రమాలను ఆధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి పి. విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమాధికారి ఎ.శ్రీలత, డీఎస్‌ఓ రుక్మిణి, బీసీ సంఘం నాయకులు ఇమంది ఉదయ్‌కుమార్, కొదుమూరి సత్యనారాయణ, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ విపాటిల్