
ఎస్టీ కమిషన్ విచారణకు అధికారుల గైర్హాజరు
ఇల్లెందురూరల్: జేకేఓసీ విస్తరణలో భాగంగా గిరిజనుల సాగుభూమి విషయంలో జాతీయ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విచారణకు బాధిత రైతులు హాజరు కాగా సింగరేణి అధికారులు గైర్హాజరయ్యారు. మండలంలోని పూసపల్లి గ్రామ సమీపంలో విజయలక్ష్మినగర్ గ్రామపంచాయతీలో గిరిజనులు సాగుచేస్తున్న సర్వే నంబర్ 588/2 పరిధిలో ఉన్న 7.03 ఎకరాల విస్తీర్ణంపై సింగరేణి అధికారులు అనుసరిస్తున్న తీరును రైతులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్‌కు వివరించారు. గతంలో రెవెన్యూ, అటవీశాఖల అధికారులు సాగులో ఉన్న తమకు పట్టాల మంజూరులో ఒకరిపై మరొకరు నెపం పెట్టుకొని అన్యాయం చేశారని వాపోయారు. ప్రస్తుతం పట్టాలు లేవన్న సాకుతో రెవెన్యూ అధికారులు తమ నుంచి భూమిని స్వాధీనం చేసుకుని, సింగరేణికి అప్పగించినట్లుగా తమకు నోట్ పంపారని తెలిపారు. ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ స్పందిస్తూ విచారణకు సింగరేణి అధికారులు హాజరు కానందున మరో సమన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహాశక్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మాలోత్ దిలీప్, 21పిట్ ఏరియా అఖిల పక్ష కమిటీ నేతలు పూనెం సురేందర్, వడ్ల శ్రీనివాస్, బాధిత రైతులు పాల్గొన్నారు.