
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్
తీవ్రంగా గాయపడిన యువకుడు
మణుగూరుటౌన్: బొగ్గు తరలిస్తున్న లారీలో లోపాలు తలెత్తడంతో రోడ్డుపైనే నిలిపారు. వెనుక నుంచి వచ్చిన ఆటో లారీని ఢీకొట్టగా.. పక్కకు తీస్తున్న క్రమంలో మరో వ్యక్తి బైక్‌తో వచ్చి ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బీటీపీఎస్‌కు మణుగూరు నుంచి బొగ్గు తరలిస్తున్న ఓ టిప్పర్ తెల్లవారుజామున విజయనగరం గ్రామం నాగులమ్మ ఆలయ సమీపంలో నడిరోడ్డుపై నిలిచిపోయింది. లారీ ఆగి ఉన్నట్లు ఎలాంటి గుర్తులు పెట్టకపోవడంతోపాటు సిగ్నల్ లైట్లు లేకపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఆటో వేగంగా ఢీకొట్టింది. ఆటోను పక్కకి తొలగిస్తున్న క్రమంలో ఓబీ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు పూర్తిచేసుకున్న కంచర్ల ప్రవీణ్ బైక్‌పై వచ్చి లారీని ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు మణుగూరు ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి భద్రాచలం, ఖమ్మం తరలించారు. ఆటో నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, వివరాలు తెలియరాలేదు. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మణుగూరు పోలీసులను రోడ్డు ప్రమాద విషయమై సంప్రదించగా ఫిర్యాదు అందలేదన్నారు.