
కాయ కుళ్లి.. పూత రాలి..
పెరుగుతున్న పెట్టుబడి..
దిగుబడులపై రైతుల దిగులు పంట చేతికొచ్చే అదనులో వీడని వర్షాలు
బూర్గంపాడు: పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలకు పత్తిరైతు కుదేలవుతున్నాడు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలు పత్తిపంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దసరాకు తొలివిడత పత్తి చేతికందే వేళ కురుస్తున్న వర్షాలకు పత్తికాయలు దెబ్బతింటున్నాయి. వర్షాలకు ఇప్పటికే మొక్కకు పది నుంచి ఇరవై కాయలు కుళ్లి నల్లబడిపోయాయి. భూమి ఆరకపోవటంతో తేమ ప్రభావంతో పత్తిలో పూత, పిందె రాలిపోతున్నాయి. జూన్, జూలై నెలల్లో ఆశాజనకంగా కనిపించిన పత్తి చేలు, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిని, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు రెండు క్వింటాళ్ల మేరా పత్తి వచ్చే కాయలు నల్లబడి కుళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పూత, పిందె రాలిపోయి మొక్కలు ఎర్రబారుతున్నాయంటున్నారు.
2 లక్షల ఎకరాలకు పైగా..
ఈ ఏడాది జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పత్తి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ.8,100 మద్దతు ధర ప్రకటించింది. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రైతులు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేపట్టారు. జూన్‌లో సాగు చేసిన పత్తిపంట అడపాదడపా వర్షాలకు జూలై నెలాఖరు వరకు ఆశాజనంగా ఎదిగింది. ఆగస్ట్‌లో ఆరంభమైన వర్షాలు పత్తిపంటను క్రమేపీ దెబ్బతీస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా వర్షాలకు కాయలు దెబ్బతిన్నాయి. పక్వానికి వచ్చిన పత్తికాయలలోకి వర్షపు నీరు చేరి కాయలు నల్లబడి కుళ్లిపోతున్నాయి. పూత, పిందెలు కూడా రాలిపోతున్నాయి. వర్షాలతో పత్తి చేలకు బూజు తెగుళ్లు, పండు తెగుళ్లు ఆశించి ఆకులు రాలిపోతున్నాయి. కలుపు పెరిగిపోతోంది. సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా వర్షాలు అడ్డంకిగా మారాయి. రైతులు మందులు పిచికారీ చేసిన గంట, రెండు గంటల్లోనే వర్షాలు కురుస్తుండటంతో రైతులకు నష్టం కలుగుతోంది. అక్కడకక్కడా పూసిన పత్తిని తీసేందుకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. వర్షాలకు కాయ గుల్లలో పత్తి ఇరుక్కుపోయి తీసేందుకు సరిగా రావటం లేదు. దీంతో ఎక్కువ మంది కూలీలను పత్తి తీసేందుకు పెట్టుకోవాల్సి వస్తోంది. క్వింటా పత్తి తీసేందుకు రూ.3 వేల వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఒక్క కూలీ రోజుకు పదికిలోల పత్తి కూడా తీయలేకపోతున్నారు. తీసిన పత్తిని కూడా ఇళ్ల వద్ద ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. వర్షాలకు రంగుమారిన పత్తిని వ్యాపారులు ఎవరు కొనుగోలు చేయటం లేదని రైతులు తెలిపారు.
ఈ ఏడాది పత్తిపంటపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రైతులంటున్నారు. వర్షాలతో పంటకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయని, ఎరువులు, సస్యరక్షణ ఎక్కువ సార్లు చేపట్టాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఐదారుసార్లు పురుగుమందులు పిచికారీ చేశామని, నాలుగైదుసార్లు ఎరువులు వేసుకున్నామని అంటున్నారు. యూరియా కొరత కారణంగా రైతులు ఈ ఏడాది ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వినియోగించారు. ఎకరాకు రూ.3 వేల వరకు అదనంగా పెట్టుబడి పెరిగింది. ఇంకా పత్తి పంటకు ఐదారుసార్లు పురుగు, దోమ, తెగుళ్ల మందులు పిచికారీ చేసుకోవాల్సిన ఉంది. చేలలో కాయలు ఏమీ లేవని, వర్షాలు తగ్గి మళ్లీ కాస్తే తప్ప పత్తి చేతికి రాదని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలోనైనా పత్తిపంటను దక్కించుకునేందుకు సరిపడా యూరియా సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరు తున్నారు. పత్తి చేలకు తెగుళ్లు ఆశిస్తున్నాయని, ఈ తరుణంలో శిలీంధ్రనాశిని మందులు ఎక్కువగా వాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పత్తి పంటపై నానో యూరియా పిచికారీ చేసుకుంటే సరిపడా నత్రజని అందుతుందని వారు రైతులకు చెబుతున్నారు.
వర్షాలకు దెబ్బతింటున్న పత్తిచేలు

కాయ కుళ్లి.. పూత రాలి..