
కలప పట్టివేత
దుమ్ముగూడెం: మండలంలోని ఆర్లగూడెం సెక్షన్ పరిధిలోని గుర్రాలబైలు శివారులో అక్రమంగా దాచి ఉంచిన కలపను అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో అక్రమంగా కలప దాచి ఉంచారనే సమాచారంతో భద్రాచలం రేంజర్ కె.రంజిత ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. కలపను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిసింది. దాడిలో ఆర్లగూడెం డీఆర్వో డి.కృష్ణ, భద్రాచలం సెక్షన్ అధికారి వీరస్వామి, బీట్ అధికారులు కుమార్, బుచ్చా, రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
బూర్గంపాడు: మండలంలోని మోతె పట్టీనగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల కాపరి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మోతె గ్రామానికి చెందిన పాశం శేషు (54) శుక్రవారం మేకలను మేపుకుని ఇంటికి వస్తున్న క్రమంలో భద్రాచలం వైపు వెళ్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శేషును స్థానికులు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేషు మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, కోడలు, మనువడు, మనువరాలు ఉన్నారు. శేషు మృతితో మోతె గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కలప పట్టివేత