
పెరుగుతున్న గోదావరి
దుమ్ముగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు మండలంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పర్ణశాల నారచీరల ప్రాంతం శుక్రవారం పూర్తిగా నీట మునిగింది. వరద పెరుగుతుండటంతో సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారి పైకి వరద నీరు చేరింది. భద్రాచలం–చర్ల ప్రధాన రహదారి తూరుబాక డైవర్షన్ రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి
కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికివరద ఉధృతి పెరగగా, శుక్రవారం నీటి మట్టం 405.80 అడుగులకు చేరింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 4500 క్యూసెక్కులు ఉండగా, రెండుగేట్లను ఎత్తి ఉంచి 10 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
తాలిపేరుకు మళ్లీ వరద
చర్ల: తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదనీరు వచ్చి చేరుతోంది. 15 గేట్లను ఎత్తి ప్రాజెక్ట్ నుంచి 20,753 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లుకాగా, వరద ఉధృతి దృష్ట్యా 73.59 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు డీఈ తిరుపతి తెలిపారు.