
‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్‌తో రూ.3 కోట్ల భూమికి ఎసరు!
అనంతపురం టౌన్: అధికార అండతో ‘పచ్చ’ నేతలు బరితెగిస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్లతో భయకంపితులను చేస్తున్నారు. కూటమి ఏడాదిన్నర పాలనలో అనంతపురం నగరం చుట్టూ ఇదే తంతు సాగుతోంది. ఇప్పటికే నగరంలో సాయినగర్‌లోని ‘అస్రా’ ఆప్టికల్స్ భవనంతో పాటు తపోవనంలోని ఎంకేఎం ఫంక్షన్ హాలు సమీపంలో 5వ రోడ్డులోని ఓ సామాజిక వర్గానికి చెందిన స్థలాల కబ్జా మరువక ముందే తాజాగా ఓ టీడీపీ నేత అనంత పురం రూరల్ మండలం ఏ. నారాయణపురం సమీపంలోని సర్వే నంబర్ 156–2లో రూ.3 కోట్ల విలువ చేసే 1.19 ఎకరాలకు ఎసరు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ సరిపూటి పద్మాగీత భర్త సరిపూటి ముకుందనాయుడు నడిపిన అడ్డగోలు బాగోతం కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. ఏ. నారాయణపురం గ్రామానికి చెందిన పెద్ద నారప్పకు గ్రామ సర్వే నంబర్ 156–2లో 9.59 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని అతని వారసులు దశల వారీగా 1999లో 3 ఎకరాలు, 2002లో 2.40 ఎకరాలు, 2008లో మిగిలిన 5 ఎకరాలను విక్రయించేశారు. ఇదే సర్వే నంబర్‌లో 1999లో 3 ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి ఒక ఎకరా స్థలాన్ని మూడో రోడ్డుకు చెందిన కవ్వలూరు కృష్ణ 2009లో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.3 కోట్లు పలుకుతోంది.
అధికార అండతో కబ్జా
కూటమి ప్రభుత్వం వచ్చాక కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పద్మాగీత, ఆమె భర్త ముకుందనాయుడు ఆ భూమిపై కన్నేశారు. టీడీపీ ప్రజాప్రతినిధుల అండతో 2025 ఆగస్టు 6న ‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిలో బోర్డు నాటారు. ఇదేమని ప్రశ్నించిన నిజమైన భూ యజమానులను వేధింపులకు గురిచేస్తున్నారు.
వారికి ప్రధాన అనుచరుడు..
కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన ముకుందనాయుడు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే ముకుందనాయుడు అనంతపురానికి మకాం మార్చి నగర ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తమకు సమీప బంధువు అంటూ హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూడో రోడ్డుకు చెందిన కృష్ణ అనే బ్రాహ్మణుల ఎకరా భూమి కబ్జా చేయడం గమనార్హం. తమ పేర్లు చెప్పి కబ్జా చేస్తున్న విషయం ఆ ఎమ్మెల్యేలకు తెలుసా..? లేదంటే తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరిస్తున్నారా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కనగానపల్లి మాజీ ఎంపీపీ భర్త ముకుందనాయుడి బరితెగింపు
టీడీపీ ఎమ్మెల్యేల అండతో రెచ్చిపోతున్న వైనం

‘డబ్బు’ల్ రిజిస్ట్రేషన్‌తో రూ.3 కోట్ల భూమికి ఎసరు!