
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.
ఎఫ్‌పీఓలు రైతులకు
మరింత చేరువ కావాలి
● జేడీ ఉమామహేశ్వరమ్మ
అనంతపురం అగ్రికల్చర్: ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓ) ఆర్థికంగా బలోపేతమై రైతులకు మరిన్ని సేవలు అందించడానికి ముందుకు రావాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అనుబంధ శాఖలు, ఎఫ్‌పీఓ ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. త్వరలో ఎఫ్‌పీఓల మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఎఫ్‌పీఓల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, వ్యాపార లావాదేవీలు, సభ్యులు, రైతులకు అందిస్తున్న వివిధ రకాల సేవలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎఫ్‌పీఓలు ముందుకు వస్తే ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నందున ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా ప్రణాళిక రూపకల్పన చేస్తామన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఉద్యాన ఉత్పత్తులు, కూరగాయల అమ్మకాలు, చేపలు తదితర వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 వరకు ఎఫ్‌పీఓలు అధికారికంగా రిజిస్ట్రేషన్ అయినా అందులో చాలా వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించడం లేదన్నారు. సమావేశంలో నాబార్డు డీడీఎం అనురాధ, జిల్లా సహకార అధికారి అరుణకుమారి, ఏపీ సీడ్స్ డీఎం వెంకటసుబ్బయ్య, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, పశుశాఖ ఏడీ డాక్టర్ రాధిక, ఉద్యానశాఖ ఏడీ దేవానంద్, మార్కెటింగ్‌శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్, మత్స్యశాఖ ఎఫ్‌డీఓ అసిఫ్, టెక్నికల్ ఏఓలు రాకేష్‌నాయక్, బాలానాయక్, కార్డు ప్రతినిధి నిర్మలారెడ్డి, ఎకాలజీ సెంటర్ ప్రతినిధి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.