
అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు
కదిరి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిల్లాలో ప్రధానంగా టీడీపీ నాయకులు కొందరు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇది సక్రమ వ్యాపారమైతే పర్వాలేదు. అంతా అక్రమ వ్యాపారమే. ఇసుక, మట్టి, మద్యం ఇలా దేన్నీ వదలడం లేదు. తాజాగా కొత్త వ్యాపారం మొదలెట్టారు. అదే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టుల బిజినెస్. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఆ రేటు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. జిల్లాలోని పలు మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఈ మధ్యే అప్‌గ్రేడ్ చేశారు. వీటికి ప్రస్తుతం ఒక్కొక్కరు చొప్పున అంగన్‌వాడీ సహాయకురాలు (ఆయా) అవసరం. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి రోస్టర్ ప్రక్రియ పూర్తి కాగానే కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో అంగన్‌వాడీ ఆయా పోస్టుల కోసం ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీన్ని గ్రహించిన కొందరు ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు ‘ఆ పోస్టు ఎలాగైనా మీకే వచ్చేలా చేస్తాం. పోటీ ఎక్కువగా ఉంది. అయినా మీకే ఇప్పిస్తాం. కాకపోతే డబ్బులు ముందే ఇవ్వాలి. ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటు వేయలేదు కదా.. ఎంతో కొంత రాబట్టుకోవాలి..’ అంటూ రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. సరాసరిన ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు అనుకున్నా రూ.16 కోట్లు పైమాటే. ఈ తంతు కొన్ని నియోజవర్గాల్లో ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుంటే.. ఇంకొన్నిచోట్ల ఆయా ఎమ్మెల్యే పీఏల కనుసన్నల్లో సాగుతోంది.
అప్‌గ్రేడ్ పేరుతో మరో వ్యాపారం
ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. వీటిలో పని చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు 10వ తరగతి ఉత్తీర్ణత లేనందున ఆయా కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయలేదు. దీన్ని కూడా స్థానిక టీడీపీ నాయకులు కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అప్‌గ్రేడ్ చేయించి మిమ్మల్నే కొనసాగిస్తాం అంటూ కొందరు, ఆ స్థానంలో వారు కాకుండా మీకు అవకాశం కల్పించే బాధ్యత మాది.. అంటూ మరి కొందరు ఇలా వారిని నమ్మిస్తూ అంగన్‌వాడీ పోస్టును అంగట్లో అమ్మకానికి పెట్టారు. కొన్ని చోట్ల రూ.6 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఇవన్నీ అప్‌గ్రేడ్ అయితే ఆయా(సహాయకురాలు) పోస్టుకు ముందే డబ్బు కట్టి రిజర్వ్ చేసుకోండి.. అంటూ కొన్ని చోట్ల డబ్బు తీసుకున్నారు.
ధర్మవరం నియోజకవర్గంలో ఓ వైపు బీజేపీ, మరో వైపు టీడీపీ నాయకులు అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఇప్పిస్తామంటూ వ్యాపారం మొదలు పెట్టారు. ఈ విషయంలో ముదిగుబ్బ మండలంలోని ఓ గ్రామంలో ఇరుపార్టీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. మంత్రి సత్యకుమార్ ఇచ్చిన జాబితానే ఫైనల్ అని బీజేపీ నాయకులంటే.. కాదు కాదు పరిటాల ఫ్యామీలీదే జరుగు తుందని టీడీపీ వారు.. ఇలా ఇరువర్గాల వాదనలు రచ్చకెక్కాయి.
... ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ ఆయా పోస్టుల పేరుతో దందా మొదలైంది. ఆశావహులు పోస్టు కోసం డబ్బులివ్వక తప్పడం లేదు.