
ఫ్యాక్షన్ గతిని మార్చిన కరివేపాకు
తాడిపత్రి రూరల్: మండలంలోని యర్రగుంటపల్లి చుట్టూ పచ్చని పంట పొలాలతో ఆకట్టుకుంటోంది. 3,066 మంది జనాభా ఉన్న ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఎక్కువగా ఎర్ర నేలలు ఉన్నాయి. కరివేపాకు పంటతోపాటు మొక్కజొన్న, కంది, అరటి, నిమ్మ, దానిమ్మ తదితర పంటలను సాగు చేస్తుంటారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామం ఒక్కప్పుడు ఫ్యాక్షన్ పడగ నీడలో ఎన్నో ఆటుపోట్లకు గురైంది.
ఆధిపత్య పోరుతో రాజుకున్న ఫ్యాక్షన్
మూడు దశాబ్దాల క్రితం యర్రగుంటపల్లిలోని కాటన్ మిల్లులో కార్మికుల మధ్య చోటు చేసుకున్న విభేదాలు గ్రామంలో చీలికలకు కారణమయ్యాయి. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. ఇదే అదనుగా ఓ వర్గానికి టీడీపీ ఆజ్యం పోస్తూ వచ్చింది. అడ్డుకునేందుకు మరో వర్గానికి కాంగ్రెస్ మద్దతు పలికింది. ఈ రెండు పార్టీలకు చెందిన ప్రధాన నేతలు తమ స్వార్థం కోసం గ్రామాన్ని రెండుగా చీల్చారు. చివరకు గ్రామంలో ఫ్యాక్షన్‌కు బీజం పడింది. హత్యలు, గృహ.. గడ్డివాముల దహనాలు, ఆస్తుల విధ్వంసం, బాంబుల మోతతో గ్రామం అట్టుడికిపోయింది. వేటకొడవండ్ల స్వైర విహారానికి నెత్తురు ఏరులై పారింది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాయి. రిమాండ్ పేరుతో జైళ్లల్లో కుమిలిపోయారు. కేసు వాయిదాలకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసుకుని తిరిగారు. దాడులు, ప్రతిదాడుల నుంచి ఎలా రక్షించుకోవాలలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. పిల్లల చదువులు అటకెక్కాయి.
కరివేపాకు సాగుతో మార్పు
ఫ్యాక్షన్ ప్రభావంతో అట్టుడికిపోతున్న సమయంలో యర్రగుంటపల్లిలోని భూములను గుంటూరుకు చెందిన కొందరు రైతులు గుత్తకు తీసుకుని కరివేపాకు సాగు చేపట్టారు. అప్పటి వరకూ వర్గ కక్షలతో నలుగుతూ పంటల సాగుపై సరైన దృష్టి సారించలేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న స్థానికుల చూపు కరివేపాకు సాగుపై పడింది. గుంటూరు ప్రాంత రైతులు లాభాలు గడిస్తుండడంతో ఒక్కసారిగా గ్రామ రైతులందరూ కరివేపాకు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వర్గ కక్షలకు స్వస్తి పలికి కరివేపాకు సాగుపై దృష్టి సారించారు. దీంతో చూస్తుండగానే ఫ్యాక్షన్ మటుమాయమైంది. అప్పటి వరకూ కత్తులు దూసుకున్న వారు బంధుత్వ వరుసలు కలుపుకుని ఆప్యాయంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున పంటల సాగుపై మనసు పెట్టడంతో 800 ఎకరాల్లో కరివేపాకు సాగు అందుబాటులోకి వచ్చింది. తొలుత యర్రగుంటపల్లికి మాత్రమే పరిమితమైన కరివేపాకు పంట ఆ తర్వాత ఇతర మండలాలకు విస్తరించింది. ప్రస్తుతం పెద్దపప్పూరు మండలంలో 780 ఎకరాలు, యాడికి మండలంలో 100 ఎకరాలు, పుట్లూరు మండలంలో 50 ఎకరాల్లో కరివేపాకు సాగులో ఉంది. యర్రగుంటపల్లికి చెందిన కొందరు రైతులు గుంతకల్లు మండలంలో పొలాలను లీజుకు తీసుకుని అక్కడ కూడా కరివేపాకు సాగు చేపట్టారు. రైలు మార్గంలో ముంబయి, చైన్నె నగరాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
కరివేపాకు సాగుతో ఫ్యాక్షనిస్టుల జీవితాల్లో వెలుగు
పిల్లలకు ఉన్నత చదువులు
కరివేపాకు వల్ల ఉపయోగం ఏముందని ప్రశ్నిస్తే.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, జీర్ణక్రియ దోహదపడుతుందని, మధుమేహాన్ని నియంత్రిస్తుందని, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఠక్కున సమాధానమిస్తారు. అయితే తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి వాసులు మాత్రం కరివేపాకును చూసి ఫ్యాక్షన్ పారిపోయిందని అంటున్నారు. వ్యక్తుల మధ్య అనుబంధాలను పెంచిందని, ప్రశాంత జీవనానికి దోహదపడిందని అంటున్నారు. ఇంతకూ కరివేపాకు దెబ్బకు ఫ్యాక్షన్ ఎలా తోకముడిచిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యర్రగుంటపల్లిని సందర్శించి తీరాల్సిందే.