
నోటి మాటే శాసనం
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25 ఇంగ్లిష్ సబ్జెక్టులో మెరిట్ అభ్యర్థి జీవితంతో అధికారులు ఆడుకుంటున్నారు. అతని కంటే వెనకున్న 8 మంది అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన అధికారులు.. ప్రస్తుతం స్వీయ రక్షణలో పడ్డారు. తమ నోటిమాటే శాసనమని నమ్మబలికి విజయవాడలో ఆర్డర్ కాపీ ఇప్పిస్తామంటూ పిలుచుకెళ్లి రిక్త హస్తాలతో వెనక్కు పిలుచుకొచ్చారు. చివరకు ఇండక్షన్ శిక్షణకూ హాజరయ్యేలా చేశారు కానీ, పోస్టుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు.
ఏమి జరిగిందంటే...
స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ మెరిట్ జాబితాలో 48వ ర్యాంకులో ఉన్న ఎ.ఆంజనేయులు పేరును వెరిఫికేషన్ రోజు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని కారణంగా ప్రీజింగ్ జాబితాలో ఉంచారు. గడువులోపు సర్టిఫికెట్లు అందజేయడంతో ఆయన పేరును అర్హుల జాబితాలో చేర్చి రాష్ట్ర అధికారులకు పంపారు. అయితే తుది జాబితాలో మాత్రం ఆంజనేయులు పేరు కనిపించలేదు. బీసీ–ఏ కేటగిరీలో అతని కంటే తక్కువ ర్యాంకులు సాధించిన 8 మందికి పోస్టులు దక్కాయి. ఇదే అంశంపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో అధికారులు స్వీయ రక్షణలో పడ్డారు. దీంతో గత నెల 23న సాయంత్రం 7.30 గంటలకు ఏపీఓ మంజునాథ్ ఫోన్ చేసి విజయవాడకు బయలుదేరాలని, అక్కడే ఆర్డర్ కాపీ ఇస్తారని చెప్పడంతో అదే నెల 24న ఉదయం అందరితో పాటు ఆంజనేయులు విజయవాడ వెళ్లారు. అయితే అక్కడికెళ్లిన తర్వాత ఆంజనేయులుకు ఎలాంటి కిట్టు ఇవ్వకుండానే వెనక్కు పిలుచుకు వచ్చారు.
శిక్షణలోనూ అటెండెన్స్ లేదు
ఈ నెల 3 నుంచి కొత్త టీచర్లకు ఇండక్షన్ శిక్షణ ప్రారంభమైంది. దీంతో 2న డీఈఓ కార్యాలయానికి ఫోన్ చేసి తన పరిస్థితి ఏమిటో చెప్పాలని ఆంజనేయులు అడిగాడు. శిక్షణ కేంద్రానికి హాజరుకావాలని, శిక్షణ ముగిసిన తర్వాత ఉత్తర్వులు అందజేస్తారని తెలిపారు. దీంతో అనంతపురం రూరల్ పంగల్‌రోడ్డు సమీపంలోని వివేకానంద జూనియర్ కళాశాల కేంద్రానికి వెళితే.. శిక్షణకు అలాట్ చేసిన అభ్యర్థుల జాబితాలో ఆంజనేయులు పేరు లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే... అందరూ ఆన్‌లైన్ (లీప్‌యాప్) అటెండెన్స్ వేస్తున్నారని, జాబితాలో పేరు లేదు కాబట్టి ఆన్‌లైన్ అటెండెన్స్ వేసేందుకు వీలుండదని తేల్చి చెప్పారు. శిక్షణకు హాజరైనా ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని జిల్లా పరిశీలకులు, జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు దృష్టికి ఆంజనేయులు తీసుకెళ్లారు. దీంతో డీఈఓ కల్పించుకుని ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.
అధికారికంగా ఎలాంటి
ఉత్తర్వూ లేకపోయినా శిక్షణకు అనుమతి
మెరిట్ అభ్యర్థి వ్యవహారంలో
విద్యాశాఖ అధికారుల తీరు
ఇబ్బంది ఉండదు
ఆంజనేయులు సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆయనకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. సాంకేతిక సమస్య కారణంగా కాస్తా ఆలస్యమై ఉండొచ్చు. వీలైనంత త్వరగా ఆయన సమస్యకు పరిష్కారం చూపుతాం.
– ఎం.ప్రసాద్‌బాబు, డీఈఓ