
చట్టం లేదు.. అంతా తూచ్!
‘‘ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా ముసాయిదా చట్టాన్ని తయారు చేశాం. బదిలీల్లో అవినీతి, రాజకీయ జోక్యాన్ని అరికడతాం. ఎలాంటి వివాదాలకు తావులేకుండా, ఉపాధ్యాయుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు జరిగేలా చట్టం రూపొందించాం..’’ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలివీ. అయితే, సరిగ్గా ఏడాదిన్నర కాలానికే సిఫార్సు బదిలీలకు కూటమి ప్రభుత్వం గేట్లు ఎత్తడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
అనంతపురం ఎడ్యుకేషన్: మూడు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో టీచర్లను ప్రభుత్వమే నేరుగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు టీచర్లు బదిలీలు అయ్యారు. కణేకల్లు మండలం మాల్యం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్‌ఏ తెలుగు టీచరుగా పని చేస్తున్న దేవన గోపమ్మను బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు, మడకశిర మండలంలో ఎస్జీటీగా పనిచేస్తున్న రాధను నల్లచెరువు మండలం గజేఖాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేశారు. ఈ బదిలీల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతో పాటు రాజకీయ పలుకుబడి ఉపయోగించారనే విమర్శలు విద్యాశాఖలో గుప్పుమంటున్నాయి. ఇది ఆరంభమేనని, రానున్న రోజుల్లో మరింతమంది బదిలీల ఉత్తర్వులు రానున్నాయని కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.
వారు చేస్తే తప్పు... వీరు చేస్తే రైటా?
గత ప్రభుత్వంలో కొందరు టీచర్లు వారి వ్యక్తిగత అవసరాల నేపథ్యంలో ఇలానే నేరుగా బదిలీలు చేయించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 మంది దాకా బదిలీ అయ్యారు. వారందరూ తీరా స్కూళ్లల్లో చేరే సమయంలో ప్రభుత్వం మారింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ ఆ బదిలీలకు ససేమిరా ఒప్పుకోకుండా అడ్డుపుల్ల వేశారు. వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులు కోర్టును ఆశ్రయించినా లాభం లేకపోయింది. అదే విద్యాశాఖ మంత్రి తాజాగా ప్రభుత్వ బదిలీలను ఎలా అంగీకరిస్తున్నారంటూ సామాన్య టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసింది తప్పయితే ఈ ప్రభుత్వం చేసింది రైటా? అని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక ముసాయిదా చట్టం తీసుకొచ్చిన వారే చట్టాన్ని తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. ప్రభుత్వ బదిలీలపై కొందరు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.
టీచర్ల సిఫార్సు బదిలీలకు గేట్లు తెరిచిన కూటమి ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో ఇద్దరు టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
గత ప్రభుత్వంలో గగ్గోలు పెట్టిన లోకేష్
అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నేరుగా బదిలీలకు శ్రీకారం
ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల మండిపాటు