ఆత్మకూరు: ట్రాక్టర్ అదుపు తప్పి నేరుగా వెళ్లి బావిలో పడింది. వివరాలు.. ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి సోమవారం ఉదయం ట్రాక్టర్‌తో తన పొలంలో సేద్యం చేస్తుండగా అదుపు తప్పి నీళ్లు లేని బావిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ట్రాక్టర్‌తో పాటు బావిలో పడిన రామచంద్రారెడ్డిని వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మంచానికి తాళ్లు కట్టి బావిలో దించారు. అనంతరం దానిపై రామచంద్రారెడ్డిని చేర్చి పైకి లాగారు. తీవ్ర గాయాలైన రామచంద్రారెడ్డిని 108 అంబులెన్స్‌లో అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు.
వ్యక్తి మృతదేహం లభ్యం
ఆత్మకూరు: అవమాన భారం తాళలేక హంద్రీ–నీవా కాలువలో దూకి గల్లంతైన ఆత్మకూరు మండలం పంపనూరు తండాకు చెందిన లక్ష్మీనారాయణ నాయక్ (45) మూడు రోజుల తర్వాత మృతదేహమై తేలాడు. వివరాలు.. తనను ఇంటి పక్కన ఉన్న మహిళ చెప్పుతో కొట్టడంతో గ్రామంలో పరువు పోయిందంటూ మనో వేదనకు లోనైన లక్ష్మీనారాయణ నాయక్ శనివారం సాయంత్రం హంద్రీ–నీవా కాలువలో దూకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, స్థానికులు ముమ్మర గాలింపు చేపట్టారు. సోమవారం ఉదయం ఆత్మకూరు మండలం గొరిదిండ్ల సమీపంలో కాలువలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పిటీషన్లు పునరావృతం
కాకూడదు : ఎస్పీ
అనంతపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక్కసారి ఇచ్చిన పిటీషన్లు పునరావృతం కాకూడదని సిబ్బందిని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురి నుంచి ఆయన వినతులు స్వీకరించారు. బాధితులో నేరుగా మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకున్నారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రంలో అర్భన్ డీఎస్పీ వి.శ్రీనివాస రావు పాల్గొన్నారు.
140 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత
కూడేరు: అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందడంతో విజిలెన్స్ ఎస్‌ఐ జమాల్‌బాషా, సీఎస్‌డీటీ శాంతకుమారి కూడేరు మండలం జల్లిపల్లి వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అనంతపురంలోని తపోవనంలో నివాసముంటున్న బాబా ఫకృద్దీన్ తన బొలెరో వాహనంలో వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి నుంచి 140 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అనంతపురం మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
రేషన్ బియ్యం డంప్ స్వాధీనం
ఉరవకొండ: స్థానిక స్పైస్ ఇన్ రైస్ రెస్టారెంట్ సమీపంలో అక్రమంగా డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం ఉదయం తహసీల్దార్ మహబూబ్‌బాషా, సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వలు ఎవరో చేశారో విచారణ చేస్తున్నట్లు సీఐ మహనంది తెలిపారు.
నిప్పంటుకుని వృద్ధుడి మృతి
తాడిపత్రి టౌన్: స్థానిక గురు లాడ్జీ సమీపంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పట్టణానికి చెందిన వడ్డే వెంకటేష్ (75) మృతి చెందాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మద్యం మత్తులో తన ఇంటి సమీపంలోని చెత్త వద్ద వడ్డే వెంకటేష్ పడిపోయాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ అంటించుకుని అగ్గిపుల్ల ఆర్పకుండా పడేయడంతో చెత్తకు నిప్పు అంటుకుంది. ఎవరూ గమనించకపోవడంతో మంటలు చెలరేగి వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్