
కూటమి నిర్లక్ష్యంపై నేడు ‘ఫ్యాప్టో’ ధర్నా
● ఉమ్మడి జిల్లా నుంచి విజయవాడలో తరలివెళ్లిన ఉపాధ్యాయులు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యారంగ, ఆర్థిక సమస్యలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండకడుతూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు మంగళవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తరలివెళ్లారు. బస్సులు, రైళ్లు, నాలుగు చక్రాల వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. విజయవాడలో ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని నాయకులు వెల్లడించారు. ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం నమ్మించి వంచనకు గురి చేసిందని వాపోయారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా విద్యారంగంలో కనీస సమస్యలు పరిష్కరించలేదన్నారు. నాలుగు డీఏలు బకాయిలున్నాయన్నారు. సరెండర్ లీవ్‌లు ఎన్‌క్యాష్‌మెంట్ చేయలేదన్నారు. ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదని మండిపడ్డారు. మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ఉద్యమబాట తప్పనిసరిగా మారిందన్నారు. ఇప్పటికై నా దిగొచ్చి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ మెడలు వంచేందుకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను
ఉపసంహరించుకోవాలి
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వైద్య విద్యను పేద, మధ్య తరగతి వారికి అందకుండా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తో్‌ందన్నారు. గత ప్రభుత్వంలో 107, 108 జీఓలకు వ్యతిరేకంగా మాట్లాడిన లోకేష్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మొత్తం కాలేజీలనే బేరం పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రైవేట్‌కు ఉద్దరించేందుకే పీపీపీ విధానం గొప్పదిగా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. చివరకు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం నర్సీపట్నం కాలేజీ నిర్మాణానికి అనుమతులే లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అవాస్తవాలు, అబద్ధపు ప్రచారాలు ఆపి తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 6,400 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేవలం రూ. 400 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. వెంటనే మొత్తం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, సహాయ కార్యదర్శులు వెంకీ, భీమేష్, హారుణ్ రషీద్, శాంతిరాజ్, నగర నాయకులు సాయి, మహేష్, పరమేష్ పాల్గొన్నారు.

కూటమి నిర్లక్ష్యంపై నేడు ‘ఫ్యాప్టో’ ధర్నా