విచారణ పూర్తి.. చర్యలే తరువాయి | - | Sakshi
Sakshi News home page

విచారణ పూర్తి.. చర్యలే తరువాయి

Oct 7 2025 4:15 AM | Updated on Oct 7 2025 4:15 AM

విచారణ పూర్తి.. చర్యలే తరువాయి

విచారణ పూర్తి.. చర్యలే తరువాయి

అనంతపురం సెంట్రల్‌: శిశుగృహలో చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తప్పవా? అంటే నివేదికలు రావడమే తరువాయి అనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మహిళా,శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం స్థానిక బుడ్డప్పనగర్‌లోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ శిశుగృహ, ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన్‌, సీడబ్ల్యూసీ (చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ) సభ్యులను వేర్వేరుగా విచారించారు. విచారణ సమయంలో మీడియాను అనుమతించలేదు. శిశువు మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిపై డైరెక్టర్‌ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు తెలిసింది. శిశుగృహలో గొడవలకు దిగుతున్న వారిపైన, పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) మంజునాథ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐసీడీఎస్‌ పీడీ నాగమణి, జిల్లా మిషన్‌ వాత్సల్య కో ఆర్డినేటర్‌ శ్రీదేవి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఫిర్యాదుల వెల్లువ..

శిశుగృహ మేనేజర్‌, సోషల్‌వర్కర్‌, ఆయా మధ్య గొడవల కారణంగానే శిశువు మృత్యువాత పడినట్లు డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో బాలుడి దత్తత కోసం వచ్చిన ఓ మహిళ నుంచి డబ్బు డిమాండ్‌ చేసిన ఉదంతాన్ని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్యంగా శిశుగృహకు వచ్చిన బాలుడి ప్రాణాలు తీశారని తెలిపారు. దీనిపై డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి స్పందిస్తూ నవజాత శిశువు మరణాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. కలెక్టర్‌ ఏర్పాటు చేసిన త్రీమెన్‌ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. శిశుగృహలో పనిచేసే సిబ్బందిపై వస్తున్న ఆరోపణలన్నింటిపైనా త్వరలోనే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

వారిలో గుబులు..

మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ విచారణ నేపథ్యంలో శిశుగృహ మేనేజర్‌, ఆయాలతో పాటు, జిల్లా మిషన్‌ వాత్సల్య కో ఆర్డినేటర్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారిలో గుబులు రేగినట్లు తెలుస్తోంది. గండం నుంచి బయట పడేందుకు కొంతమంది రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారని సమాచారం. శిశుగృహకు నవజాత శిశువు అనారోగ్యంతో వచ్చాడని, విరేచనాలతో చనిపోయాడని డాక్టర్‌ నివేదికలు తెప్పిస్తే సరిపోతుందనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, కలెక్టర్‌ ఆనంద్‌ తొలిరోజే అధికారులు తూతూమంత్రంగా ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో విచారణ నిక్కచ్చిగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సుమోటో కేసు నమోదు

అనంతపురం/అనంతపురం సెంట్రల్‌: మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో నవజాత శిశువు మృతిపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎన్‌. రాజశేఖర్‌ స్పందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆదేశాలతో సుమోటోగా కేసు నమోదు చేసి సోమవారం శిశుగృహను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల సంరక్షణ, పిల్లలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.

శిశువు మృతిపై మహిళా,శిశు

సంక్షేమశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ విచారణ

శిశుగృహ, ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన్‌, సీడబ్ల్యూసీ సిబ్బంది నుంచి

వివరాల సేకరణ

నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement