
పృథ్వీరాజ్‌కు ‘మై భారత్’ పురస్కారం
● రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రదానం
శెట్టూరు: మండలంలోని చిన్నంపల్లికి చెందిన ముమ్ముల్ల పృథ్వీరాజ్ మై భారత్ రాష్ట్రీయ సేవా యోజన పురస్కారం అందుకున్నాడు. న్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రశంసాపత్రం స్వీకరించాడు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా పృథ్వీరాజ్ అందించిన ఉత్తమ సేవలను గుర్తించి పురస్కారం ప్రదానం చేశారు. పృథ్వీరాజ్ నెల్లూరు సింహపురి యూనివర్సిటీలో పీజీ (బయోటెక్నాలజీ) పూర్తి చేశాడు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా డిజిటల్ ఇండియా, బాలికా శిక్షా, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకున్న పృథ్వీరాజ్‌కు గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు.
గజవాహనంపై
చింతల రాయుడి విహారం
తాడిపత్రి రూరల్: పట్టణంలోని శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి దేవాలయంలో సోమవారం స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు స్వామి వారికి అర్చకులు మురళిస్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. గజవాహనంపై స్వామివారిని అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు.
నేడు రథోత్సవం
చింతలవెంకటరమణస్వామి కల్యాణ, రథోత్సవాలను మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ రామాంజనేయులు తెలిపారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవం అనంతరం విందు ఉంటుంది. ఆ తర్వాత భూదేవి, శ్రీదేవి సమేత చింతలరాయుని ఉత్సవ విగ్రహాలను గాంధీకట్ట వద్ద ఉన్న రథం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు.
‘ఉపాధి’లో మేసేశారు!
● రూ.13.40 కోట్ల పనుల్లో
రూ.1.87 కోట్ల అక్రమాలు
శెట్టూరు: ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది. మండలంలో 2024 ఏప్రిల్ 31 నుంచి 2025 మార్చి 1 వరకూ వరకు జరిగిన రూ.13.40 కోట్ల పనుల్లో రూ.1.87 కోట్ల అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి పీడీ సలీం బాష, ఏపీడీ సుధాకర్ రెడ్డి, డీవీఓ శ్రీనివాసులు హాజరయ్యారు. ఒక్క కనుకూరు పంచాయతీలోనే రూ.93 లక్షలకు పైగా అక్రమాలు జరిగినట్లు తేల్చి, రూ.72 వేలు జరిమానా విధించారు. లక్ష్మంపల్లి, చిన్నంపల్లి, ములకలేడులోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు తనిఖీ బృందం తేల్చింది. అక్రమాలకు పాల్పడిన ఉపాధి టీఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు మొత్తం రూ.2,56,500 జరిమానా విధించారు.
కనికట్టు చేశారు..
మండలంలోని ప్రతి గ్రామంలో ఉపాధి పనుల్లో కనికట్టు చేసినట్లు వెల్లడైంది. రైతులకు క్షేత్ర స్థాయిలో మొక్కలు లేకపోయినా ఉన్నట్లు చూపి, బ్లాక్ ప్లాంటేషన్‌లో మొక్కలు పదుల సంఖ్యలో ఉంటే వందలాది మొక్కలు ఉన్నట్లు నమోదు చేసి బిల్లులు చేసుకున్నారు. ప్రతి గ్రామంలో అధికార టీడీపీ నాయకులకు అదనపు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. మండలంలోని చిన్నంపల్లిలో ఆశా, ములకలేడులో అంగన్‌వాడీ కార్యకర్తలకు భర్తలు ఉన్నా వితంతు పింఛన్ తీసుకుంటున్నట్లు తనిఖీలో బయటపడింది. ఆయా గ్రామాల్లో వితంతు, డప్పు, చర్మకళాకారుల పెన్షన్లను పలువురు అక్రమంగా పొందుతున్నట్లు సిబ్బంది గుర్తించారు.

పృథ్వీరాజ్‌కు ‘మై భారత్’ పురస్కారం