
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం
9న నర్సీపట్నం వైద్య కళాశాల భవనాలను సందర్శించనున్న వైఎస్ జగన్
● 7 నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా వెళ్లే అవకాశం
● మాజీ సీఎంను కలవనున్న స్టీల్‌ప్లాంట్, సుగర్ ఫ్యాక్టరీ, బల్క్‌డ్రగ్ పార్క్ బాధితులు
● వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు అమర్‌నాఽథ్, కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ ఉవ్వెత్తున ఉద్యమిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. సోమవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నంలో మెడికల్ కళాశాలను సందర్శించనున్నారని తెలిపారు. ఈ పర్యటన విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా సాగుతుందన్నారు. వైఎస్ జగన్‌ను స్టీల్‌ప్లాంట్, సుగర్ ఫ్యాక్టరీ, బల్క్‌డ్రగ్ పార్క్ బాధితులు కలవనున్నారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టంగా వెల్లడిస్తున్నా.. కూటమి పార్టీల ఎంపీలు, మంత్రులకు ఏమీ పట్టనట్లుగా ఉన్నారన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న వనరులను కూటమి నేతలు దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా.. కూటమి నేత సొంత యూనివర్సిటీ కోసం నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. విద్య, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణే్‌ష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడారు.