
యాప్‌రోగం
మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ యాప్ (ఏబీహెచ్‌ఏ) ద్వారా ఓపీ టికెట్ల జారీలో ఆన్‌లైన్ సర్వర్ సమస్య కారణంగా జాప్యం జరిగింది. సోమవారం, ముఖ్యంగా దసరా పండుగ తర్వాత కావడంతో, ఓపీకి రోగుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం 1200 నుంచి 1300 టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద సోమవారం దాదాపు 1800 మందికి ఓపీలు, 80 మందికి కే–షీట్‌లు జారీ చేశారు. ఆరు కౌంటర్లు రోగులు, వారి బంధువులతో కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు రద్దీ కొనసాగింది.
‘యాప్’సోపాలు
ఒకవైపు సర్వర్ సమస్యతో పాటు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ఏబీహెచ్‌ఏ యాప్ ద్వారా టికెట్లను జారీ చేయడంలోనూ రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు స్మార్ట్‌ఫోన్ లేక, యాప్ డౌన్‌లోడ్ చేయలేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సిగ్నల్ లేకపోవడం, ఆధార్ అప్‌డేట్ కాకపోవడం, వేలిముద్రలు సక్రమంగా పడకపోవడం వంటి కారణాల వల్ల యాప్ డౌన్‌లోడ్ ప్రక్రియ ఆలస్యమై, రోగులు మరింత ఎక్కువ సమయం కౌంటర్ల వద్ద నిరీక్షిస్తున్నారు. ఆన్‌లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో టికెట్లు జారీ నిలిచిపోయి, కౌంటర్ల వద్ద రద్దీ పెరగడంతో రోగులు, వారి బంధువులను అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బందికి కూడా కష్టమవుతోంది.

యాప్‌రోగం