
ఘనంగా వాల్మీకి జయంతి
పాడేరు : మానవాళికి రామాయణం వంటి మహోత్తర గ్రంథాన్ని అందించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అని.. నాటి సమాజాభివృద్ధికి ఆయన చేసిన మేలు మరువలేనిదని కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణ శ్రీపూజ అన్నారు. వాల్మీకి మహర్షీ జయంతి వేడుకలను మంగళవారం కలెక్టరేట్, ఐటీడీఏలో ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణ శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత తదితరులు వాల్మీకి మహర్షి చిత్రపటాలకు పూలమామలు వేసి నివాళులు అర్పించారు. ఆయన తన రచనలతో సమాజంలో ఉన్న అసమానతలను తొలగించే ప్రయత్నం చేశారన్నారు. చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించడం ద్వారా మనుషులు రుషులవుతారని నిరుపించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. ఎస్‌డీసీ లోకేశ్వరరావు, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు.
రంపచోడవరం : ప్రపంచంలోనే వాల్మీకి రామాయణం గొప్ప కావ్యమని అందుకు ప్రతి వ్యక్తి రామాయణం చదవాలని రంపచోడవరం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డి.ఎన్.వి.రమణ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశపు హాలులో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి ఐటీడీఏ ఏపీఓ జనరల్ రమణ, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ డేవిడ్, ఎస్‌ఓ టి. మార్తమ్మ పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.
● వాల్మీకి పేటలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, మాజీ సర్పంచ్ నిరంజనీదేవి పాల్గొన్నారు. రంప గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత చక్రవర్తి, సర్పంచ్ మంగా బొజ్జయ్య వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
● మారేడుమిల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. మండల వాల్మీకి అధ్యక్షుడు గొర్లె అనుదీప్ కుమార్, మాజీ ఎంపీటీసీ గొర్లె అనిల్ ప్రసాద్ (బాబీ), మండల వాల్మీకి కమిటీ దూడ సువర్ణ కర్ణ కుమార్, లక్కొండ పాల్ బుజ్జి, లక్కొండ దావీదు, దూడ బ్రహ్మాజీ, గడుతూరి కిషోర్ కుమార్, సువర్ణ రాజు, పరామయ్య పాల్గొన్నారు.

ఘనంగా వాల్మీకి జయంతి