
గోమంగి గురుకుల ప్రిన్సిపాల్, ఏటీడబ్ల్యూవోను సస్పెండ్
పెదబయలు: మండలంలో మారుమూల గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్, ఏటీడబ్ల్యూవోను సస్పెండ్ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ, గురుకులం సెల్ అధికారులకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఆ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. పాఠశాలలో 207 మందికి గాను కేవలం 13 మంది విద్యార్థినులు ఉండడంతో ప్రిన్సిపాల్ వసంతకుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చారని తెలిసి పలు వురు విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ తీరుపై ఫిర్యాదు చేశారు. విద్యార్థినులను కర్రతో కొట్టిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకునే వరకూ విద్యార్థినులను పాఠశాలకు పంపబోమని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తెలిపారు. గత నెల 19 తేదీన 7వ తరగతి చదువుతున్న 18 మంది విద్యార్థినులను ప్రిన్సిపాల్ కర్రతో కొట్టారని, ఈ ఘటనకు నిరసనగా పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తే, స్థానిక అధికారులు విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఏటీడబ్ల్యూవో స్వర్ణలతతో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినులు పాఠశాలకు రాకుంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమెను ప్రశ్నించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ డీడీ, గురుకులం సెల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రిన్సిపాల్, ఏటీడబ్ల్యూవోలను సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అనంతరం పాఠశాల రికార్డులు, హాజరుపట్టికలు పరిశీలించారు. సక్రమంగా లేకపోవడాన్ని గమనించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జి.రంగారావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కృష్ణారావు, సత్తిబాబు, అప్పారావు, ధనలక్ష్మి, నాగరాజు, వెంకటరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం

గోమంగి గురుకుల ప్రిన్సిపాల్, ఏటీడబ్ల్యూవోను సస్పెండ్