
జీతం బకాయి కోసం కుటుంబ సమేతంగా ఆందోళన
● 29 మాసాలుగా వేతనం
చెల్లించని పంచాయతీ కార్యాలయం
● కుటుంబ సమేతంగా ఆందోళనకు
దిగిన విశ్రాంత ఉద్యోగి వెంకటరత్నం
మాడుగుల రూరల్: కె.జె.పురం గ్రామ పంచాయతీ కార్యాలంలో గతంలో పని చేసిన కాలానికి జీతం ఇవ్వని కారణంగా పంచాయతీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో మంగళవారం అందోళన చేపట్టారు. మాడుగుల గ్రామానికి చెందిన బోండా వెంకటరత్నానికి ఆమె భర్త మరణాంతరం స్పౌజ్ కోటాలో ఉద్యోగం వచ్చింది. వెంకటరత్నం భర్త ఆనందరావు గతంలో మాడుగుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిల్లు కలెక్టరుగా పని చేసేవారు. 1998 సెప్టెంబరులో ఆయన మృతి చెందడంతో వెంకటరత్నానికి ఆఫీసు వాచ్‌వుమెన్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఈమె కె.జె.పురం గ్రామ పంచాయతీలో 2019 డిసెంబరు 30న ఉద్యోగ విరమణ చేశారు. పంచాయతీ నిధుల కొరతతో 29 మాసాల జీతం ఆమెకు చెల్లించలేదు. సుమారు రూ. 9 లక్షలు పంచాయతీ నుంచి రావలసి ఉంది. ఈ జీతం గురించి ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి పంచాయతీ కార్యాలయం చుట్టు తిరిగినా ఫలితం లేకపోయింది. బకాయి చెల్లించాలని అమె మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి అందోళన చేపట్టారు. ఆ సమయంలో పంచాయతీ జూనియర్ సహాయకులు, బిల్లు కలెక్టర్ వున్నారు. పంచాయతీ కార్యదర్శి చింతలూరులో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి నవీన్‌దొరతో అమె ఫోన్‌లో మాట్లాడారు. 5 మాసాలకు సంబంధించిన జీతాల ప్రతిపాదన పెడతామని ఫోన్‌లో హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించారు.