
హైడ్రో పవర్ రద్దుకు బస్కీ పంచాయతీ తీర్మానం
అరకులోయటౌన్ : మండలంలోని బస్కీ పంచాయతీలో మంగళవారం జరిగిన గ్రామ సభలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సర్పంచ్ పాడి రమేష్ అధ్యక్షతన మంగళవారం బస్కీ గ్రామ పంచాయతీలో జరిగిన పాలక వర్గంతోపాటు పంచాయతీ ప్రజలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మండల వైస్ ఎంపీపీ కిల్లో రామన్న మాట్లాడారు. గత కొన్ని నెలలుగా రగులుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రకటించారని, దానిని శాశ్వతంగా నిలిపి వేయాలని, జీఓ నెంబర్ 13, 51 రద్దు చేయాలని రామన్న డిమాండ్ చేశారు.
అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, గుగ్గుడు పీసా కమిటీ కార్యదర్శి పొద్దు బాలదేవ్ విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 5వ షెడ్యూల్‌లో ఆదివాసీల హక్కులు, చట్టాలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం నవయుగ కంపెనీకి చిట్టంవలస హైడ్రోపవర్ ప్రాజెక్టు ఎగువ డ్యాం కోసం 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి జీఓలు తీసుకువచ్చి బస్కీ పంచాయతీ గిర్లిగుడ, ఇరుకుగుడ మధ్యలో 177 అడుగుల ఎత్తులో డ్యాం నిర్మాణం కోసం ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ తీర్మానం, పీసా కమిటీ తీర్మానం లేకుండా దొడ్డి దారిలో వచ్చి సరిహద్దు దిమ్మలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓలు వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బురిడి దశరథ్, మాజీ సర్పంచ్ కామరాజు, మాజీ ఎంపీటీసీ నూకరాజు, గిరిజనులు పాల్గొన్నారు.