
పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పెదబయలు: గిరిజన పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ కోదువలస గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు పిడుగుపడి గ్రామంలో 10 మంది గిరిజన రైతులకు చెందిన 20 పశువులు మృతి చెందాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు. ఆ పది మంది రైతులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు. పిడుగుపడి మృతి చెందిన 17 దుక్కి టెద్దులు, మూడు ఆవులకు రూ. 5,15,000 నష్టపరిహారం చెల్లింపునకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్టు ఈ సందర్భంగా పెదబయలు పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ కిశోర్ ఎమ్మెల్యేకు తెలిపారు.
అనంతరం గ్రామంలో ఇంటింటినీ ఎమ్మెల్యే సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని, బోర్‌వెల్ మంజూరు చేయాలని, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని, పీఎం జన్‌మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీటీ రంగారావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు, పంచాయతీ నాయకులు వల్లంగి కాశీప్రసాద్, కాకరి నూకరాజు, బత్తిరి మాణిక్యం, వంతాల రాందాసు, కొర్ర నాగేశ్వరరావు, పొనాయి గంగారాజు, కిముడు రాంబాబు, నరంజీ కేశవరావు, రామారావు, వంశీ, రాంప్రసాద్, మాజీ ఎంపీటీసీ పొయిభ కృష్ణారావు, గుల్లేలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.