
10వేల ఎకరాల్లో కొత్త కాఫీ తోటలు
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు: గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ తోటలను ఆశించిన బెర్రీబోరర్ పురుగు నిర్మూలనకు కాఫీ లైజన్ వర్కర్లు చేసిన కృషి అభినందనీయమని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో కాఫీ బోర్డు అధికారులు, లైజన్ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో గిరిజనులు సాగు చేస్తున్న అన్ని కాఫీ తోటలను పునరుద్ధరించాలని ఆదేశించారు. 2026–27 సంవత్సరంలో పది వేల ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటల సాగు, 15వేల పాత కాఫీ తోటల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏజెన్సీలో 38 ప్రాథమిక నర్సరీ కేంద్రాలను గుర్తించామని చెప్పారు. వాటి ద్వారా రైతులు స్వీలర్ వోక్, కాఫీ మొక్కలను సరఫరా చేస్తామన్నారు. నవంబర్ నెల నుంచి మాక్స్ సంస్థ ద్వారా కాఫీ పండ్ల సేకరణకు కాఫీ లైజన్ వర్కర్లు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ బొంజుబాబు, లైజన్ వర్కర్లు పాల్గొన్నారు.