● జిల్లా ఆస్పత్రికి రోగుల రద్దీ
● ఒక్కరోజే 639 మందికి వైద్య పరీక్షలు
సాక్షి,పాడేరు:
జిల్లాపై వ్యాధులు దాడి చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో వీటి తీవ్రత పెరిగింది. విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లు మంచం పడుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వరపీడితులు కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరులోని జిల్లా సర్వజన ఆస్పత్రికి ఇటీవల రోగుల తాకిడి అధికమైంది. పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రికి రిఫరల్ కేసులు అధికంగా వస్తున్నాయి. రోజువారీ ఓపీ 600 దాటుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 639 మంది రోగులకు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు.వీరిలో జ్వరపీడితులు అధికంగా ఉన్నారు.తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 22మంది ఇన్‌పెషంట్లుగా చేరారు. అన్ని వార్డుల్లో మొత్తం 270 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
వణుకుతున్న పల్లెలు
జిల్లాలో రోజూ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు,తాగునీటి వనరుల కలుషితం, పారిశుధ్యలోపం, దోమల వ్యాప్తి వంటి కారణాలతో జ్వరాలు విజృంభిస్తుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. టైఫాయిడ్,వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి.జిల్లాలోని 64 పీహెచ్‌సీలు, అరకులోయ, రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రులు, ముంచంగిపుట్టు, చింతపల్లి, చింతూరు, అడ్డతీగల, కూనవరం కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలోను జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది.అలాగే ప్రైవేట్ ఆస్పత్రులు,ఆర్‌ఎంపీ వైద్యులను కూడా జ్వరపీడితులు ఆశ్రయిస్తున్నారు.
400 దాటిన ఓపీ
అరకులోయటౌన్: నియోజకవర్గంలో వ్యాధులు వ్యా పిస్తున్నాయి. దీంతో కొద్ది రోజులుగా స్థానిక ఏరి యా ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. గతంలో 300 నుంచి 350 వరకూ ఉండే రోజువారీ ఓపీ ఇప్పుడు 400 దాటుతోంది. జ్వర పీడితులు అధికంగా వస్తున్నారు. గత నెలలో 28 మలేరియా, ఐదు డెంగ్యూ, 270 టైఫాయిడ్, 595 వైరల్ ఫీవర్ కేసులు నమోదైనట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాము తెలిపారు.
కూనవరం: మండలంలో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కోతులగుట్ట సీహెచ్‌సీకి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వారు అధికంగా వస్తున్నారు. ప్రతి రోజు 120 నుంచి 130 పైగా ఓపీ ఉంటున్నట్లు సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ బాబు తెలిపారు. సోమవారం 125మంది అవుట్ పేషంట్లు చికిత్సపొందారు.
వ్యాధుల పంజా