
స్వచ్ఛత లక్ష్యాల సాధనలో ప్రజల భాగస్వామ్యం అవసరం
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అవార్డులను అందజేస్తున్నట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని వీఆర్ పంక్షన్ హాల్లో సోమవారం స్వచ్ఛాంధ్ర అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను అవలభించేలా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు దృష్టిసారించాలన్నారు. ప్రతి పంచాయతీలోని పారిశుధ్య కార్మికులకు బీమా చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వాహణ, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం తదితర వాటిపై కృషి చేసిన 38 ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు స్వచ్ఛాంధ్ర అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పాడేరు, జి.మాడుగు, చింతపల్లి, జీకే వీధి ఎంపీపీలు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీడీవోలు, పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.