
ఎకో టూరిజం ప్రాజెక్టు రద్దు కోరుతూ రేంజర్ కార్యాలయం ము
అరకులోయటౌన్: మండలంలోని మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును అటవీ శాఖ అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మాడగడ పంచాయతీ ప్రజలు సోమవారం అరకులోయలోని రేంజర్ కార్యాలయాన్ని ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌ను తమ నుంచి లాక్కొని, అటవీశాఖ ఆధీనంలోకి మారుస్తామనడం సరికాదన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి, అటవీశాఖ అధికారులు ఏ రకంగా వ్యూపాయింట్‌ను స్వాధీనం చేసుకుని, నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. వ్యూపాయింట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 300కు పైగా కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, ఆ కుటుంబాల పొట్ట కొట్టేందుకు అటవీశాఖ పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వెలుగులోకి తెచ్చేందుకు మాడగడ ఆటో యూనియన్‌తోపాటు అరకులోయ వాయు పుత్ర మోటర్ యూనియన్ ఎంతో శ్రమించిందని చెప్పారు. అనతికాలంలో ప్రాచు ర్యం పొందిన వ్యూపాయింట్ అభివృద్ధి చెంది, వేలాది మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటే, ఆదాయాన్ని తమ సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం.. అటవీశాఖ ద్వారా ఇబ్బందులకు గురిచేస్తోందని వారు వాపోయారు. ఇప్పటికైనా ఎకో టూరిజం ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ మాడగడ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.