
ఉత్తమ ఫలితాలు రాకుంటే ఉపేక్షించం
● జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు
● శిక్షణ తరగతులకు గైర్హాజరైన 11మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
ముంచంగిపుట్టు: పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ ఏడాది పూర్తిగా నిరాశపరిచాయని,వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాలు రాకపోతే ఉపేక్షించేది లేదని, ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–1లో ఉపాధ్యాయులకు సోమవారం టీచింగ్ ఎట్ రీడింగ్ లెవల్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.ఈ తరగతులను డీఈవో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆశించిన విద్యాప్రమాణాలను రాబట్టాలన్నారు. పలు సర్వేల్లో విద్యార్థులకు కనీస సామర్థ్యం లేనట్లుగా తేలడంతో కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రత్యేక చొరవతో ఈ ఏడాది రెండో దఫా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బాగా వెనకబడిన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ ఏడాది టెన్త్‌లో కేవలం 47 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో 80శాతానికి పైగా ఫలితాలు వచ్చే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పది పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత నడుమ జరుగుతాయని,వారాంతపు సమీక్షలు ఉంటాయని తెలిపారు. శిక్షణ తరగతులకు 11 మంది ఉపాధ్యాయులు హాజరు కాకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంఈవో కృష్ణమూర్తిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో త్రినాథ్,రిసోర్స్ పర్సన్ హరిబాబు,క్లస్టర్ రిసోర్స్ మానటరింగ్ టీచర్లు అనిల్,గౌరిశంకర్,సూర్యనారాయణ,సురేష్,ఈశ్వర్,భాస్కర్ పాల్గొన్నారు.
పెదబయలు: విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు అన్నారు. పెదబయలు స్కూల్ కాంప్లెక్స్ భవనంలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జ్ రఘు,ఎంపీడీవో ఎల్. పూర్ణయ్య,ఎంఈవో కె. కృష్ణమూర్తి, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పి.తిరుపతిరావు,గోపాలరావు, గంగాభవాని,అప్పారావు,దేముడు తదితరులు పాల్గొన్నారు.