
మెరుగైన బోధనకు కృషి చేయాలి
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందుకు తమ బోధనాభ్యసన స్థాయిలను పెంచుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. పట్టణంలోని శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమాలు అన్ని మండలాల్లో ఏర్పాటు చేశామన్నారు. రెండు విడతలుగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి విడత శిక్షణ తరగతులు ఈనెల 6నుంచి 8వ తేదీవరకు, రెండో విడత శిక్షణ కార్యక్రమాలు 9నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. మొదటి విడతలో 3,111 మంది ఉపాధ్యాయులు, రెండో విడతలో 3,098 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కోసం 128 మంది రీసోర్స్ పర్సన్‌లు, రాష్ట్ర స్థాయి నుంచి 80 మంది ఎస్‌ఆర్‌పీలను నియమించినట్టు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త స్వామి నాయుడు, ఎంఈవోలు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, డీఆర్పీలు, సమగ్ర శిక్ష సిబ్బంది, సీఆర్పీలు పాల్గొన్నారు.