
తాగునీటి సమస్యపై గ్రామస్తుల ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని మారుమూల భూసిపుట్టు పంచాయతీ కేంద్రంలో నిర్మించిన రక్షిత తాగునీటి పథకానికి చెందిన ట్యాంక్ ప్రారంభించక ముందే పాడైయింది. ట్యాంక్‌కు రంధ్రం ఏర్పడి నీరు వృథాగా పొతుంది. దీంతో సోమవారం భూసిపుట్టు గ్రామ గిరిజనులు దెబ్బతిన్న ట్యాంకు వద్ద ఆందోళనకు దిగారు.పాడైన ట్యాంక్‌కు మరమ్మతులు చేయాలని, నీటి పథకం ప్రారంభించాలని, నీటి కష్టాలు తీర్చాలని పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు కంచం మిన్నారావు, వంతాల బొంజుబాబు, గ్రామస్తులు జలంధర్,సాధురాంలు మాట్లాడుతూ భూసిపుట్టులో రూ.10లక్షలతో నిర్మించిన ఆర్‌వో ప్లాంట్ మూడు సంవత్సరాలుగా ప్రారంభించకుండా, నిరుపయోగంగా ఉంచారని, నీటి సరఫరా కోసం నిర్మించిన ట్యాంక్ నాణ్యత లోపంతో రంధ్రం ఏర్పడిందని, అనేకసార్లు ఆర్‌వో ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కోరినా పట్టించుకోలేదన్నార.తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే నీటి కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.