
పోర్టు అడుగులు
వైజాగ్ పోర్టు ఏర్పడి నేటికి 92 ఏళ్లు మేజర్ పోర్టులతో పోటీపడుతూ అభివృద్ధి పనులు కవర్డ్ స్టోరేజ్ యార్డులు నిర్మాణం, బెర్త్‌ల పునరుద్ధరణ పనులు అందుబాటులోకి మోడ్రన్ పోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్
వడివడిగా
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్‌కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ నేటితో 92 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఏటికేడూ ప్రగతి పథంలో పయనిస్తూ.. నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ దేశంలోని మేజర్ పోర్టులతో పోటీ పడుతూ సరికొత్త వ్యూహాల్ని అనుసరిస్తోంది. పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో పోర్టు వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి సరికొత్త సొబగులద్దుకోనుంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో.. విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. ఈ ఏడాది స్వచ్ఛతా అవార్డుల్లో దేశంలో ప్రథమ స్థానం సాధించింది.
తొలి పాసింజర్ షిప్ జలదుర్గతో..
1927లో విశాఖపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1933 అక్టోబర్ 7న పోర్టు నుంచి సరకు రవాణాని ప్రారంభించింది. సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ తొలి పాసింజర్ షిప్ జలదుర్గని విశాఖ పోర్టుకు తీసుకొచ్చింది. అప్పటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విల్లింగ్ డన్ నౌకాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం హార్బర్‌ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఇంజనీర్లు డబ్ల్యూసీ యాష్, ఓబీ రాటెన్‌బరీలు ముఖ్య భూమిక పోషించారు. పోర్టుకు సమీపంలోనే స్టీల్‌ప్లాంట్, సెయిల్, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్ షిప్‌యార్డు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, హెచ్‌పీసీఎల్ వంటి భారీ పరిశ్రమలున్నాయి. పోర్టులో ప్రధానంగా స్టీల్, పవర్, మైనింగ్, పెట్రోలియం, ఎరువులు తదితర సరుకుల్ని నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యంత లోతైన కంటైనర్ టెర్మినల్ పోర్టులోనే ఉండటం విశేషం.
సరికొత్త సంస్కరణలు
గ్రీన్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్‌ని ఏర్పాటు చేసి.. పోర్టుకు అవసరమైన విద్యుత్‌మొత్తాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా మరో 190 కిలోవాట్ల విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తోంది. 2055–26 నాటికి 30 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు.
● ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన కింద రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి.
● 845 మీటర్ల పొడవు, 16 మీటర్ల సహజ సిద్దమైన లోతును కలిగి విశాఖ కంటైనర్ టెర్మినల్ కంటైనర్ ట్రాఫిక్ కు ముఖ ద్వారంలా ఉంది. ఏపీ, తెలంగాణా, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర జార్ఖండ్, మధ్యప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విశాఖ కంటైనర్ టెర్మినల్ గేట్ వేగా వ్యవహరిస్తోంది.
● మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి ట్రక్ పార్కింగ్ టెర్మినల్‌ను 666 వాహనాల పార్కింగ్ సామర్ధ్యంతో నిర్మించింది. 84,000 టన్నుల సరుకును నిల్వ ఉంచే విధంగా కవర్డ్ స్టోరేజ్ షెడ్ నిర్మాణాలు, యార్డు నిర్మాణం పూర్తి చేసింది.
● పోర్టులోని కార్యకలాపాల్ని యాంత్రీకరించే ప్రక్రియ జోరందుకుంది. రూ.655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్త్ లను యాంత్రీకరించే పనులు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నారు.
● రూ.800 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, సీఎన్జీ బంకరింగ్ స్టేషన్ నెలకొల్పేందుకు హెచ్‌పీసీఎల్, ఐఓసీతో ఎంవోయూ కుదుర్చుకుంది.
● రూ.276 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్–2 నిర్మాణం, అడ్వాన్స్‌డ్ ఫైర్‌ఫైటింగ్ ఫెసిలిటీ, ఆర్‌ఎఫ్‌ఐడీ గేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మోడ్రన్ పోర్టు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రారంభించారు.
● ఇటీవలే ఏడు దేశాలకు ఆతిథ్యమిస్తూ బిమ్స్‌టెక్–2025 కాంక్లేవ్‌ని విజయవంతంగా వీపీఏ నిర్వహించింది.